నెదర్లాండ్స్‌పై ప్రతాపం చూపించిన పాక్ బౌలర్లు... వంద కూడా కొట్టలేకపోయిన డచ్..
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 91 పరుగులు మాత్రమే చేసిన నెదర్లాండ్స్.... 3 వికెట్లు తీసిన షాదబ్ ఖాన్! మళ్లీ నిరాశపరిచిన బాబర్ ఆజమ్..
గత మ్యాచ్‌లో జింబాబ్వే చేతుల్లో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టు, పసికూన నెదర్లాండ్స్‌పైన ప్రతాపం చూపించింది. షాదబ్ ఖాన్ 3, మహ్మద్ వసీం జూనియర్ రెండు వికెట్లతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్... నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 91 పరుగులు మాత్రమే చేయగలిగింది...
మేబర్గ్ 6, మ్యాక్స్ ఓడాడ్ 8 పరుగులు చేసి అవుట్ కాగా 16 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన బస్ డే లీడ్, పాక్ బౌలర్ హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో గాయపడ్డాడు. హారీస్ రౌఫ్ వేసిన రాకాసి బౌన్సర్, బస్ డే లీడ్ హెల్మెట్‌కి బలంగా తాకింది. ఈ దెబ్బకి బస్ డే లీడ్ ముఖానికి గీసుకుపోయి రక్తం కారింది. ఫిజియో వచ్చి పరీక్షించిన తర్వాత నొప్పితో బాధపడుతూ పెవిలియన్ చేరాడు బస్ డే లీడ్...
టాప్ కూపర్ 1, వార్ డేర్ మెర్వ్ 5, టిమ్ ప్రింగెల్ 5 పరుగులు చేయగా అకీర్‌మెన్ 27 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు చేసి నెదర్లాండ్స్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎడ్వర్డ్స్ 20 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసి నెదర్లాండ్స్ తరుపున డబుల్ డిజిట్ స్కోరు దాటిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు...
ఫ్రెడ్ క్లాసీన్ డకౌట్ కాగా వాన్ మెకీరన్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. పాక్ బౌలర్లలో షాదబ్ ఖాన్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా మహ్మద్ వసీం జూనియర్‌కి 2 వికెట్లు దక్కాయి. షాహీన్ ఆఫ్రిదీ, నసీం షా, హారీస్ రౌఫ్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.
టీ20 వరల్డ్ కప్‌లో పూర్తి 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమ్‌కి ఇదే అత్యల్ప స్కోరు. ఇంతకుముందు 2012లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేయగా నెదర్లాండ్స్ 20 ఓవర్ల ఆడి 9 వికెట్లు కోల్పోయి 91 పరుగులే చేసింది.
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి ఓవర్‌లో మహ్మద్ రిజ్వాన్ 11 పరుగులు రాబట్టగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి రెండు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయిన బాబర్ ఆజమ్... 5 బంతుల్లో 4 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు... 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది పాకిస్తాన్...
2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత బాబర్ ఆజమ్ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ కావడం ఇది 10వ సారి. మొత్తంగా తన కెరీర్‌లో మొదటి 62 ఇన్నింగ్స్‌ల్లో 8 సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకి అవుటైన బాబర్ ఆజమ్, ఆ తర్వాత 28 ఇన్నింగ్స్‌ల్లో 10 సార్లు డబుల్ డిజిట్ స్కోరు అందుకోకుండానే పెవిలియన్ చేరడం విశేషం.