Asianet News TeluguAsianet News Telugu

రోహిత్.. సూపర్ హిట్..! బౌండరీపై స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన నేపాల్ క్రికెటర్

ఆ జట్టు ఓటమి అంచున చేరింది. ఇంకొన్ని ఓవర్‌లలో ఇది ఖరారు కానుంది. అయినప్పటికీ ఆ ఫీల్డర్ అందుకున్న క్యాచ్ జట్టు సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపింది. నేపాల్, ఒమన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో నేపాల్ క్రికెటర్ రోహిత్ పౌదెల్ బౌండరీ దగ్గర సిక్స్ వెళ్తున్న బంతిని అద్భుతరీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నది.
 

nepal cricketer rohit paudel took a spectacular catch at boundary in a match against oman
Author
New Delhi, First Published Sep 15, 2021, 3:44 PM IST

న్యూఢిల్లీ: మ్యాచ్ ఓడిపోయినా నేపాల్ క్రికెటర్ రోహిత్ పౌదెల్ అందరి మనసులను గెలుచుకున్నాడు. తన స్టన్నింగ్ క్యాచ్‌తో సిక్స్‌ను ఔట్‌గా మార్చేశాడు. సిక్స్ వెళ్తున్న బంతిని ఎగిరి ఒంటి చేత్తో అందుకుని మళ్లీ గాల్లోకి విసిరాడు. బౌండరి దాటిన ఆయన అడుగులను మళ్లీ గ్రౌండ్‌లో వేసి గాల్లోని బంతిని అందుకుని అబ్బురపరిచాడు. ఆ అద్భుత క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్2లో భాగంగా నేపాల్, ఒమన్, యూఎస్ఏల మధ్య ముక్కోణపు సిరీస్ జరుగుతున్నది. ఇందులో భాగంగా నేపాల్, ఒమన్‌ల మధ్య మంగళవారం ఓ మ్యాచ్ జరిగింది. ఇందులోనే రోహిత్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నారు. అయినప్పటికీ ఒమనే విజయం సాధించింది. నేపాల్ 196 పరుగులు సాధించి 197 పరుగుల లక్ష్యాన్ని ఒమన్ ముందుంచింది. ఒమన్ తరఫున ఓపెనింగ్‌లో దిగిన జతీందర్ సింగ్ బ్యాట్ ఝుళిపించాడు. 62 బంతుల్లోనే సెంచరీ చేసి వాహ్వా అనిపించుకున్నాడు. నేపాల్ జట్టుకు ఆయనను నిలువరించడం సవాల్‌గా మారింది.

ఈ తరుణంలోనే నేపాల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. సిక్స్ వెళ్లాల్సిన బంతిని గాల్లోనే అడ్డుకుని జతీందర్ సింగ్‌ను పెవిలియన్‌కు పంపాడు. కానీ, అప్పటికే ఒమన్ లక్ష్యానికి చాలా సమీపానికి చేరుకుంది. దీంతో తదుపరి క్రీజులోకి వచ్చిన మహ్మద్ నదీమ్ జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు.

Follow Us:
Download App:
  • android
  • ios