ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్ ఫైనల్‌లో చిత్రవిచిత్రమైన హై డ్రామా... ఆఖరి ఓవర్‌లో 4 పరుగులు చేయలేక 5 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆస్ట్రేలియా టీమ్ స్కార్పియన్స్.. 

టీ20 క్రికెట్ వచ్చిన తర్వాత ఆఖరి ఓవర్‌లో 36 పరుగులు చేయాల్సి ఉన్నా, గెలవడం అసాధ్యమేమీ కాదు. ఓవర్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాదే హిట్టర్లు చాలామంది ఉన్నారు. అలాంటిది 6 బంతుల్లో విజయానికి కేవలం 4 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో ఓటమి పాలైంది ఓ టీమ్. చేతిలో 5 వికెట్లు ఉన్నా ఒక్క ఫోర్ బాదలేక 5 వికెట్లు కోల్పోయి 1 పరుగు తేడాతో చిత్తుగా ఓడింది... వినడానికి విచత్రంగా ఉన్నా ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్‌‌లో స్కార్పియన్స్, తస్మానియా టీమ్స్ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో జరిగిందీ సంఘటన...

తొలుత బ్యాటింగ్ చేసిన తస్మానియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. లీజెల్లీ లీ 46 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేయగా కెప్టెన్ ఎలీసా విల్లానీ 126 బంతుల్లో 10 ఫోర్లతో 110 పరుగులు చేసింది. నవోమి స్టాలెన్‌బర్గ్ 89 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 75 పరుగులు చేసింది...

వర్షం కురిసి కొద్ది సేపు ఆటకు అంతరాయం కలగడంతో డీఎల్‌ఎస్ విధానం ప్రకారం స్కార్పియన్స్ టీమ్‌కి 47 ఓవర్లలో 242 పరుగులను టార్గెట్‌ని నిర్ణయించారు. ఎమ్మా డి బ్రోగ్ 68 పరుగులు చేయగా కోర్ట్నీ వెబ్ 83 పరుగులు చేసింది. అనీ ఓ నీల్ 28, జెమ్మా బార్సీ 28 పరుగులు చేశారు. 46వ ఓవర్ ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది స్కార్పియన్స్ టీమ్. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. ఒక్క ఫోర్ బాది ఉమెన్స్ నేషన్స్ క్రికెట్ లీగ్ ఛాంపియన్‌గా నిలవచ్చు.

అయితే మొదటి బంతికి అనీ ఓ నీల్ క్లీన్ బౌల్డ్ అయ్యింది. ఆ తర్వాతి బంతికి సింగిల్ వచ్చింది. మిగిలిన 4 బంతుల్లో 3 పరుగులు చేస్తే చాలు. అయితే జెమ్మా బార్సీ భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యింది. ఆ తర్వాతి బంతికి అమాండా వెల్లింగ్టన్ రనౌట్ అయ్యింది. ఐదో బంతికి ఎల్లా విల్సన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరింది. ఆఖరి బంతికి అనీసు బుసంగ్వే కూడా రనౌట్ అయ్యింది..

Scroll to load tweet…

దీంతో ఆఖరి ఓవర్‌లో 1 పరుగు చేసి 5 వికెట్లు కోల్పోయి 241 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దీంతో మ్యాచ్ పోయ్యిందని ఫిక్స్ అయిన తస్మానియా టీమ్ 1 పరుగు తేడాతో సంచలన విజయం అందుకుంది. 7 టీమ్స్ పాల్గొనే ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్, 1996-97 సీజన్‌లో ప్రారంభమైంది. న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెర్రిటరీ, క్వీన్స్‌లాండ్, సౌత్ ఆస్ట్రేలియా, తస్మానియా, విక్టోరీయి, వెస్ట్రరన్ ఆస్ట్రేలియా టీమ్స్‌ ఇందులో పాల్గొంటున్నాయి.. సౌత్ ఆస్ట్రేలియా టీమ్ నిక్ నేమ్ స్కార్పియన్స్...