కారు ప్రమాదాన్ని గుర్తించి, రిషబ్ పంత్‌కి సాయం చేసి, అంబులెన్స్ ఎక్కించిన హర్యానా బస్సు డ్రైవర్, కండక్టర్...  రుణపడి ఉంటామని వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్.. 

భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా కాలి బూడిదైంది. రిషబ్ పంత్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద సమయంలో రిషబ్ పంత్‌ని మొట్టమొదట చూసిన ఓ బస్సు డ్రైవర్, అతన్ని రోడ్డు పక్కన కూర్చోబెట్టినట్టు చెప్పిన విషయం తెలిసిందే...

రిషబ్ పంత్‌ తల నుంచి రక్తం కారుతుండడంతో తన శాలువా కప్పిన ఆ బస్సు డ్రైవర్, అంబులెన్స్‌కి ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించాడు కూడా. మానవత్వం చాటుకున్న ఆ బస్సు డ్రైవర్ వివరాలను తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, జాతీయ క్రికెట్ అకాడమీ ఛీఫ్ వీవీఎస్ లక్ష్మణ్...

‘సుశీల్ కుమార్, ఓ హర్యానా రోడ్‌వేస్ డ్రైవర్. ఇతనే కాలుతున్న కారులో నుంచి రిషబ్ పంత్‌ని బయటికి తీసి, అతనికి బెట్ షీట్ కప్పి, అంబులెన్స్‌కి ఫోన్ చేసింది. నిస్వార్థంగా నువ్వు చేసిన ఈ సాయానికి రుణపడి ఉంటాం సుశీల్ జీ...

Scroll to load tweet…

సుశీల్ కుమార్‌తో పాటు బస్ కండక్టర్ పరమ్‌జిత్ కూడా ఎంతో సాయం చేశాడు. ఈ ఇద్దరూ ఆ ప్రమాద సమయంలో చూపించిన సమయ స్ఫూర్తి, గొప్ప మనసు వెలకట్టలేనిది...’ అంటూ పోస్ట్ చేశాడు వీవీఎస్ లక్ష్మణ్..

రిషబ్ పంత్‌ని కాపాడిన బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్‌ పరమ్‌జీత్‌లకు రివార్డుతో పాటు ప్రశంసా పత్రాలను అందచేసింది హర్యానా ప్రభుత్వం. అయితే వారికి ఎంత మొత్తం అందించారనే విషయాలు మాత్రం తెలియరాలేదు.

‘అతివేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్‌కి ఢీకొని పల్టీకొట్టడం నేను చూశాను. వెంటనే బస్సును పక్కకు ఆపి దగ్గరికి వెళ్లి చూశాను. రిషబ్ పంత్‌కి తీవ్రంగా గాయాలయ్యాయి. అతనే లేచి కారులో నుంచి బయటికి వచ్చాడు. రిషబ్ పంత్ దగ్గరికి వెళ్లి కింద కూర్చోబెట్టాను...

ముఖమంతా రక్తం కారిపోతూ ఉంది. నా దగ్గరున్న ఓ రగ్గుతో అతనికి చుట్టాను. అప్పటికి అతను ఇంకా స్పృహలోనే ఉన్నాడు. తన గురించి, తన వారి గురించి చెబుతున్నాడు. నేను వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేశాను... ఆ సమయంలో అతని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. కారు బోల్తా కొట్టడంతో అవన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. వాటిని తీసి బ్యాగులో వేసి అతనికే ఇచ్చాను...’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రత్యేక్ష సాక్షి బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్,...

కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్‌ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్‌ని వెంటనే పక్కనే ఉన్న సాక్ష్యం మల్లీస్పెషాలిటీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం రిషబ్ పంత్‌ని డెహ్రాడూన్‌కి తరలించారు...