యూఏఈ దేశానికి చెందిన మహ్మద్ నవీద్, సైమన్ అన్వర్ భట్‌ను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి ఎనిమిదేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి. 2019లో జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ సమయంలో ఈ ఇద్దరూ అవినీతికి పాల్పడినట్టు వెల్లడి కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి.

మహ్మద్ నవీద్, సైమన్ అన్వర్ భట్‌లను 2019 వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌ల సమయంలో కొందరు బుకీలు కలిసారు. వారితో మ్యాచ్ ఫిక్సింగ్‌కి ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఐసీసీ విచారణలో అంగీకరించారు ఈ ఇద్దరు క్రికెటర్లు.  

అంతేకాకుండా 2019 టీ10 లీగ్ సమయంలో కూడా ఇద్దరు బుకీలను కలిసినట్టు అంగీకరించాడు నవీద్. 16, అక్టోబర్ 2019 నుంచి ఈ ఇద్దరిపై విధించిన నిషేధం అమలులోకి వస్తుంది. అంటే 2026 వరకూ దేశీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు వీరికి అనుమతి ఉండదు.