Asianet News TeluguAsianet News Telugu

National Sports Awards: ఆ ఆటగాళ్లకు పురస్కారాల ప్రధానం.. రాష్ట్రపతి చేతుల మీదుగా మన రత్నాలకు పట్టాభిషేకం

National Sports Awards 2021: ఈసారి అత్యధికంగా 12 మందికి ఖేల్ రత్నతో పాటు అర్జున అవార్డుకు కూడా భారీగానే క్రీడాకారులు ఎంపికయ్యారు. అత్యధికంగా 35 మందికి ఈ అవార్డును ఎంపికచేయడం గమనార్హం.

National Sports Awards 2021: President Ramnath Kovind honours India's sporting best at National awards ceremony
Author
Hyderabad, First Published Nov 14, 2021, 1:48 PM IST

విశ్వ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.  ఒలింపిక్స్ తో పాటు ఇతర టోర్నీలలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ అత్యుత్తమ ఆటతీరుతో దేశానికి పతకాలు సాధించి ‘ఖేల్ రత్న’, ‘అర్జున’ అవార్డులు పొందిన క్రీడాకారులకు పురస్కారాలు ప్రధానం చేసింది. శనివారం రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం కన్నులపండుగగా జరిగింది.  2021 సంవత్సరానికి గాను  క్రీడాకారులు ఈ అవార్డులు అందుకున్నారు. కొద్ది రోజుల క్రితమే ముగిసిన  టోక్యో ఒలింపిక్స్ లో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాతో పాటు 11 మందికి ఈసారి ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’ దక్కిన విషయం విదితమే. 

ఇక క్రికెటర్లలో భారత  స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ కు అర్జున అవార్డు దక్కగా..  టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కు ఖేల్ రత్న దక్కింది. 22 ఏండ్లుగా ఆమె భారత మహిళల క్రికెట్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నది. ఆమెతో పాటు  భారత ఫుట్బాల్ జట్టుకు 19 ఏండ్లుగా ఆడుతున్న కెప్టెన్ సునీల్ ఛెత్రికి కూడా అత్యున్నత పురస్కారం దక్కింది. 

ఖేల్ రత్న అందుకున్నది వీళ్లే.. 

 

నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), రవి దహియా (రెజ్లింగ్), లవ్లీనా బోర్గోహైన్ (బాక్సింగ్), మన్ ప్రీత్ సింగ్, పీఆర్ శ్రీజేష్ (హాకీ), అవనీ లేఖరా (పారా షూటింగ్), మనీశ్ నర్వాల్ (పారా షూటింగ్), సుమిత్ అంటిల్ (పారా అథ్లెటిక్స్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), కృష్ణ నాగర్ (పారా బ్యాడ్మింటన్), మిథాలీ రాజ్ (క్రికెట్), సునీల్ ఛెత్రి (ఫుట్బాల్) 

 

ఖేల్ రత్న తో పాటు ఈసారి అర్జున అవార్డుకు కూడా భారీగానే క్రీడాకారులు ఎంపికయ్యారు. అత్యధికంగా 35 మందికి ఈ ఏడాది అర్జున అవార్డు ఇవ్వడం గమనార్హం. జాబితాలో టోక్యో ఒలింపిక్స్ నెగ్గిన భారత హాకీ జట్టు సభ్యులు 15 మంది, భారత మహిళల హాకీ జట్టు నుంచి ఇద్దరు ఉండటం గమనార్హం. 

 

కాగా.. ఖేల్ రత్నలకు రూ. 25 లక్షలు, అర్జున అవార్డు గ్రహీతలకు రూ. 15 లక్షల నగదు బహుమానం అందింది.  నగదు తో పాటు ప్రశంసాపత్రం కూడా దక్కింది. ఆటగాళ్లతో పాటు ఉత్తమ  శిక్షకులకు ద్రోణాచార్య అవార్డును కూడా అందజేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios