Asianet News TeluguAsianet News Telugu

Asia Cup: ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం..! నసీం షా పోరాటానికి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా

IND vs PAK: ఇండియా-పాకిస్తాన్ మధ్య  ఆదివారం ముగిసిన ఉత్కంఠ మ్యాచ్ లో భారత్ నే విజయం వరించింది. కానీ పాకిస్తాన్ కుర్రాడు నసీం షా పోరాటం మాత్రం ఆకట్టుకుంది. 

Naseem Shah Stellar Performance wins Hearts, Fans Calls Him Fighter
Author
First Published Aug 29, 2022, 3:26 PM IST

ఆసియా కప్-2022లో భాగంగా  ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లో అరంగేట్ర బౌలర్ నసీం షా అదరగొట్టాడు.  స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ప్రపంచ మేటి బ్యాటర్లు ఉన్న జట్టును ఒకింత వణికించాడు ఈ 19 ఏండ్ల కుర్రాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ లో షాహీన్ షా అఫ్రిది బౌలింగ్ ను గుర్తు చేస్తూ.. ఈ మ్యాచ్ లో అతడు లేని లోటును భర్తీ చేస్తూ  అతడు సాగించిన పోరాటం అందరినీ కట్టిపడేసింది.  పాకిస్తాన్ లోని పర్వత శ్రేణి ప్రాంతమైన ఖైబర్ ఫంక్తువా నుంచి వచ్చిన ఈ కుర్రాడు.. 16 ఏండ్ల వయసులోనే  పాకిస్తాన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2019లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో ఆడాడు. కానీ అతడికి ఇదే తొలి టీ20 మ్యాచ్. 

148 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టు ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చారు.  కెరీర్ లో తొలి  టీ20 మ్యాచ్ ఆడుతున్న నసీం షా.. తాను వేసిన రెండో బంతికే టీమిండియా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అలా భారత్ కు తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. 

అదే ఓవర్లో.. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీని కూడా ఔట్ చేసేవాడే గానీ స్లిప్స్ లో ఫకర్ జమాన్ క్యాచ్ మిస్ చేయడంతో కోహ్లీ బతికిపోయాడు. ఈ క్యాచ్ గనక  ఫకర్ పట్టిఉంటే మ్యాచ్ ఫలితం కచ్చితంగా మరో విధంగా ఉండేదనేది మ్యాచ్ చూసినవారంతా చెబుతున్నమాట.  తన తొలి ఓవర్లోనే సూపర్బ్ స్పెల్ వేసిన  నసీం..  రెండో స్పెల్ లో కూడా అదరగొట్టాడు. క్రీజులో కుదురుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 

ఇక  ఈ మ్యాచ్ కే హైలైట్ నసీం షా వేసిన 17వ ఓవర్. ఆ ఓవర్లో అతడు వికెట్లేమీ తీయకపోయినా అప్పటికే కాలికి గాయం కావడంతో   ప్యాడ్ కట్టుకుని మరీ బౌలింగ్ చేశాడు నసీం షా. నడవడమే ఇబ్బందిగా ఉన్న తరుణంలో 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరాడు. బంతి విసిరిన తర్వాత  నొప్పి తీవ్రత ఎక్కువవుతున్నా దానిని పంటికిందే భరించాడు. ఇదే ఓవర్లో నాలుగో బంతికి రవీంద్ర జడేజాకు విసిరిన బంతి అతడి ప్యాడ్ కు తాకింది. దీంతో అతడు ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేశాడు.   ఈ క్రమంలో కాలి నొప్పి తాళలేక కిందపడిపోయి విలవిల్లాడుతున్నా ఔట్ కోసం అప్పీల్ చేశాడు. 

 


ఒకరకంగా చెప్పాలంటే నసీం ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ వేసేప్పుడు ఓ చిన్నపాటి పోరాటమే చేశాడని చెప్పొచ్చు.  వెరసి తొలి మ్యాచ్ లోనే 4 ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. షాహీన్ అఫ్రిది లేని లోటును భర్తీ చేశాడు. మిగిలిన ఇద్దరు పేసర్లు దహానీ,  హరీస్ రౌఫ్ విఫలమైన చోట.. నసీం షా మాత్రం  మెరుగైన ప్రదర్శన చేశాడు. 

 

నసీం షా ప్రదర్శనకు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు భారత్ లో అభిమానులు కూడా అతడిపై  ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రత్యర్థి జట్టులో ఉన్నా నిన్ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నామంటూ  కామెంట్స్ చేస్తున్నారు. నసీం షా ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే ఆ జట్టుకు ఫ్యూచర్ స్టార్ దొరికేసినట్టే.. 

Follow Us:
Download App:
  • android
  • ios