Asianet News TeluguAsianet News Telugu

లిస్ట్ ఏ క్రికెట్‌లో తమిళ తంబీల సంచలనం.. జగదీశన్ వీరబాదుడుతో భారీ విజయం..

Narayan Jagadeesan: దేశవాళీ క్రికెట్ లో భాగంగా విజయ్ హజారే  ట్రోపీలో తమిళనాడు జట్టు రికార్డులు నెలకొల్పింది. వ్యక్తిగతంగా ఓపెనర్లిద్దరూ భారీ భాగస్వామ్యం నెలకొల్పగా  తర్వాత  బౌలర్లు కూడా  అరుణాచల్ ప్రదేశ్ బ్యాటింగ్ ను  కకావికలం చేశారు. 
 

Narayan Jagadeesan Double Ton and Siddharth Fiver Helps Tamilnadu to Scripts History in List A Cricket
Author
First Published Nov 21, 2022, 5:10 PM IST

తమిళ తంబీలు దేశవాళీలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. దేశవాళీ క్రికెట్ (లిస్ట్ ఏ - 50 ఓవర్ల ఫార్మాట్) లో భాగంగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ (వీహెచ్‌టీ) లో  తమిళనాడు క్రికెట్ జట్టు  రికార్డుల దుమ్ముదులిపింది. ఆ జట్టు ఓపెనర్, యువ సంచలనం  నారాయణ్ జగదీశన్.. డబుల్ సెంచరీతో  పలు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. జగదీశన్ తో పాటు  మరో ఓపెనర్ సాయి   సాయి  సుదర్శన్ లు తొలి వికెట్ కు భారీ భాగస్వామ్యం నెలకొల్పగా.. నిర్ణీత 50 ఓవర్లలో తమిళనాడు ఏకంగా  500 పరుగుల మార్కును దాటింది. లిస్ట్ ఏ క్రికెట్ లో  ఒక జట్టు స్కోరు 500 పరుగులు దాటడం ఇదే ప్రథమం. 

అరుణాచల్ ప్రదేశ్ తో మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు.. 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. నారాయణ్ జగదీశన్..  141 బంతుల్లోనే 25 బౌండరీలు, 15 సిక్సర్లతో  277 పరుగులు చేశాడు.  ఈ ట్రోఫీలో జగదీశన్ కు ఇది వరుసగా ఐదో సెంచరీ కావడం గమనార్హం.   తద్వారా అతడు విరాట్ కోహ్లీ,  పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ ల రికార్డు (ఇదే ట్రోఫీలో వరుసగా నాలుగు సెంచరీలు) లను అధిగమించాడు. 

అతడికి తోడుగా సాయి సుదర్శన్.. 102 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగులు చేశాడు. వీరి తర్వాత  బాబా అపరంజిత్ (31 నాటౌట్), బాబా ఇంద్రజీత్ (31 నాటౌట్) లు మరో వికెట్ కోల్పోకుండా  చూశారు.  కాగా లిస్ట్ ఏ క్రికెట్ లో 500 ప్లస్ స్కోరు చేయడం ఇదే ప్రథమం. గతంలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు..  నెదర్లాండ్స్ పై 498 పరుగులు  రికార్డు  సృష్టించింది. ఈ రికార్డును ఇప్పుడు తమిళనాడు అధిగమించింది. 

ఇక జగదీశన్  - సుదర్శన్ లు తొలి వికెట్ కు ఏకంగా 38.3 ఓవర్లలోనే 416 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది కూడా రికార్డే. ఇంతకముందు 2015లో  క్రిస్ గేల్ - మార్లున్ సామ్యూల్స్ జింబాబ్వే మీద 372 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఇప్పుడు ఆ రికార్డు కూడా చెరిగిపోయింది. 

 

జగదీశన్  ఈ మ్యాచ్ లో 277 పరుగులు చేయడం ద్వారా లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.  గతంలో ఇంగ్లాండ్ లోని సర్రే కౌంటీకి ఆడిన  అలెస్టర్ బ్రౌన్.. 268 పరుగులు చేయగా  రోహిత్ శర్మ  శ్రీలంకపై 264 రన్స్ కొట్టాడు.  ఈ రెండు రికార్డులు ఇప్పుడు బద్దలయ్యాయి. 

ఇదిలాఉండగా భారీ లక్ష్య ఛేదనలో అరుణాచల్ ప్రదేశ్ తడబడింది.  తమిళ బౌలర్లు ఎం. సిద్ధార్థ్ ఐదు వికెట్లతో చెలరేగగా సిలంబురసన్, మహ్మద్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా అరుణాచల్ ప్రదేశ్ 28.4 ఓవర్లలో 71 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో  కెప్టెన్ కమ్షా యాంగ్ఫో ఒక్కడే (17) టాప్ స్కోరర్. నలుగురు బ్యాటర్లు డకౌట్ అవగా.. మరో నలుగురు సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. డబుల్ డిజిట్  స్కోరు చేసింది ముగ్గురు మాత్రమే.  దీంతో తమిళనాడు  435 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios