Asianet News TeluguAsianet News Telugu

తొందరపడొద్దు.. కాస్త ఓపిక పట్టండి.. పతకాలు గంగలో కలుపుతామన్న రెజ్లర్లను కోరిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి

Wrestlers Protest 2023: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలని   రెజ్లర్లు చేస్తున్న పోరాటం నానాటికీ ఉధృతమవుతోంది. 

My Dear Athletes, Please Wait : Anurag Thakur to protesting Wrestlers Amid Medal Immersion Threat MSV
Author
First Published Jun 1, 2023, 11:42 AM IST

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ)  చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలని  డిమాండ్ చేస్తూ  ఢిల్లీలో  గడిచిన  37 రోజులుగా నిరసన చేస్తున్న రెజ్లర్లు   కేంద్రానికి  డెడ్ లైన్ విధించారు. తమకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన పతకాలను గంగలో కలిపేస్తామంటూ  రెండ్రోజుల క్రితం ప్రకటించిన   మల్ల యోధులు.. కేంద్రానికి ఐదు రోజులు గడువు విధించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్ల డెడ్ లైన్ పై  స్పందించారు. రెజ్లర్లు తొందరపడొద్దని.. విచారణ  పూర్తయ్యేవరకూ కాస్త ఓపిక పట్టాలని సూచించారు. 

రెజ్లర్లు ఇచ్చిన డెడ్‌లైన్ పై ఠాకూర్ స్పందిస్తూ... ‘రెజ్లర్లు జనవరిలో తమ పోరాటం ప్రారంభించినప్పుడు ఇందులో  రాజకీయ పార్టీలకు ఏ సంబంధమూ లేదని మాతో చెప్పారు.  కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.. 

అయితే నేను దానిపై ఏ విధమైన కామెంట్స్ చేయదలుచుకోవడం లేదు.  కానీ  నా ప్రియమైన క్రీడాకారులారా..! దయచేసి కొన్నాళ్లు ఓపిక పట్టండి. ఢిల్లీ పోలీసులు ఈ కేసుపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.  సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో వాళ్లు  ఎఫ్ఐఆర్ నమోదుచేసి  విచారణ చేస్తున్నారు.  విచారణ ముగిసేలోగా  ఏ చర్యలు తీసుకున్నా అది క్రీడాకారులకు నష్టం వాటిల్లుతుంది.  మేమంతా క్రీడాకారులకు అండగా ఉంటాం.  వారు క్రీడల్లో పురోగమించాలని  కేంద్రం కోరుకుంటున్నది. 

ఈ దేశంలో  క్రీడాకారుల అభ్యున్నతికి  మేం  కృషి చేస్తున్నాం.   ప్రధానమంత్రి మోడీ మార్గదర్శకత్వంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నాం.  ఒక్క బడ్జెట్   కేటాయింపుల్లోనే కాదు.  దేశానికి   క్రీడాకారులు అందించిన విజయాలు కూడా ఉన్నాయి..’  అని తెలిపారు. 

 

కాగా పార్లెమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా  అటు దిశగా మార్చ్ మొదలుపెట్టిన రెజ్లర్లను పోలీసులు ఈడ్చిపడేసిన విషయం తెలిసిందే. స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షిమాలిక్, బజరంగ్ పునియా వంటివారిని   పోలీసులు ఈడ్చి బస్ లో పడేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు, ఫోటోలు  ప్రజాస్వామ్యవాదులను కలిచేశాయి. ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై  సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios