శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ కి కీలక పదవి దక్కనుంది. ఆయన శ్రీలంక నార్త్ ప్రావిన్స్ గవర్నర్ గా నియమితులు కానున్నట్లు సమాచారం. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. మురళీధరన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి బాధ్యతలను చేపట్టాలని కోరినట్లు  ఓ వార్త పత్రిక వార్త ప్రచురించింది.

ఈ నవంబర్ నెల ప్రారంభంలో రాజపక్స శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. రాజపక్స ప్రభుత్వంలో మాజీ ఏస్ స్పిన్నర్ మురళీధరన్ తోపాటు మరో ఇద్దరు గవర్నర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అనురాధ యహంపతి ఈస్ట్ ప్రావిన్స్, తిస్సా వితర్ణ నార్త్ సెంట్రల్ ప్రావిన్స్ లకు గవర్నర్ బాధ్యతలు స్వీకరిస్తారని రాష్ట్రపతి సచివాలయ వర్గాలు తెలిపాయి.

ముత్తయ్య మురళీధరన్ మాజీ క్రికెటర్ అన్న విషయం తెలిసిందే.  అనురాధ యహంపతి నేషనలిస్ట్ ఎంటర్ ప్రెన్యూర్ అసోసియేషన్ చైర్ పర్సన్, వస్త్ర ఎగుమతి సంస్థ డైరెక్టర్. ఇక తిస్సా వితర్ణ మాజీమంత్రి, లంక సమ సమాజ పార్టీ నాయకుడు. వితర్ణ మెడికల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ పదివిలో చాలా కాలం పాటు సేవలు అందించారు. 

మురళీధరన్‌ బౌలింగ్‌లో పలు ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టారు. టెస్ట్ ఫార్మాట్‌లో, వన్డేల్లో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంక తరఫున 133 టెస్టులు ఆడిన మురళీ 800 వికెట్లు పడగొట్టాడు. 350 వన్డేల్లో 534 వికెట్లు, 12 టీ20ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.