ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‎లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తయింది. ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టుపై రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. హార్జిక్ పాండ్యా ఇటు బ్యాటింగులోనూ అటు బౌలింగులోనూ చెలరేగడంతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‎కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ లో తడబడిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత పుంజుకుంది. సూర్య కుమార్ యాదవ్ 59, కృణాల్ పాండ్యా 42, హార్థిక్ పాండ్యా 25 పరుగులు చేయడంతో ముంబై ఇండియన్స్ గౌరవప్రదమైన లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచగలిగింది. హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీచేశాడు, అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
 
ఆ తర్వాత 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ప్రారంభంలోనే బలమైన ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు వాట్సన్, రాయుడు ఒకరి వెంట మరొకరు అవుట్ కావడంతో చెన్నై కష్టాల్లో పడింది. దాంతో ఆరు పరుగులకే చెన్నై రెండు వికెట్లు కోల్పోయింది.

తర్వాత బ్యాటింగ్‎కు వచ్చిన రైనా, ధోనీలు కూడా రాణించలేదు. కేదార్ జాదవ్‎ (54 బంతుల్లో 58, 8 ఫోర్లు, 1సిక్స్) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.