ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గురువారం డిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడి ముంబై ఇండియన్స్ సునాయాస విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ముంబై జట్టు సమిష్టిగా రాణించి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెలరేగి ఈ అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు పాండ్యా బ్రదర్స్ చెలరేగడంతో  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు సాధించగలిగింది. ఇలా జట్టుకు పరుగులు సాధించిపెట్టే క్రమంలో హార్ధిక్ పాండ్యా ధోని స్టైల్ షాట్ తో అభిమానులను అలరించాడు. 

ఢిల్లీ స్టార్ బౌలర్ రబాడ వేసిన చివరి ఓవర్‌లో హార్ధిక్ కళ్లు చెదిరే భారీ సిక్సర్ బాదాడు. ధోనికి మాత్రమే సాధ్యమైన హెలికాప్టర్ షాట్ తో బంతిని స్టాండ్ కు పంపించాడు. ఇలా లెగ్‌స్టంప్‌పై పడ్డ బంతిని బలంగా బాది బ్యాట్ ను గింగిరాలు తిప్పుతూ డీప్ మిడ్‌వికెట్ మీదుగా కొట్టిన ఈ భారీ అభిమానుల మనసును దోచుకుంది. మరీ ముఖ్యంగా ధోని అభిమానులు పాండ్యా సిక్సర్ ను మెచ్చుకోకుండా వుండలేకపోతున్నారు. నిజంగానే  ఇది అచ్చు మా బాస్(ధోని) స్టైల్లోనే వుందని సంబరపడుతున్నారు. 

డిల్లీ బౌలర్ కీమో పాల్‌ వేసిన 18 ఓవర్ నుండి పాండ్యా బ్రదర్స్ వీరబాదుడు షురూ అయ్యింది. ఈ ఓవర్లో మొదట కృనాల్‌ ఒక ఫోర్‌ కొడితే... హార్దిక్‌ వరుసగా 4, 6 బాదాడు. ఇలా ఈ ఓవర్లో 17 పరుగులు పిండుకున్నారు. ఆ తర్వాత మోరిస్‌, రబడ ఓవర్లలో కూడా వీరు జోరు కొనసాగించడంతో ముంబై 168 పరుగులు సాధించింది. 169 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన డిల్లీ నిర్ణీత ఓవర్లలో 128 పరుగులకే చేతులెత్తేసి ఘోర ఓటమిని చవిచూసింది.