ఆస్ట్రేలియా టూర్‌లో తొలి టెస్టులో ఘోరంగా విఫలమై, భారత జట్టుకి దూరమైన యంగ్ ఓపెనర్ పృథ్వీషా, విజయ్ హాజరే ట్రోఫీ 2021లో అద్భుత శతకంతో చెలరేగాడు. ఫలితంగా ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముంబై. టాస్ గెలిచిన ముంబై జట్టు, ఫీల్డింగ్ ఎంచుకుంది.

బ్యాటింగ్ మొదలెట్టిన ఢిల్లీ, సున్నాకే ఓపెనర్లు ఇద్దరి వికెట్లు కోల్పోయింది. అనుజ్ రావత్, శిఖర్ ధావన్ ఇద్దరూ పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యారు. అయితే హిమ్మత్ సింగ్ 145 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 106 పరుగులు చేయగా శివాంక్ వశిస్ట్ 70 బంతుల్లో 6 ఫోర్లతో 55 పరుగులు చేయడంతో 50 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది ఢిల్లీ...

212 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఈజీగా చేధించింది ముంబై జట్టు. యశస్వి జైస్వాల్ 8 పరుగులకే అవుట్ అయినా శ్రేయాస్ అయ్యర్ 39 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేశారు. పృథ్వీషా 89 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచి ముంబై జట్టుకి విజయాన్ని అందించాడు.