Asianet News TeluguAsianet News Telugu

‘ది హండ్రెడ్’లో కలిసి మ్యాచ్ చూసిన గూగుల్ సీఈవో, ఆసియా కుబేరుడు, టీమిండియా మాజీ హెడ్ కోచ్.. ఏదో జరుగుతోంది..!

The Hundred League: టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ప్రస్తుతం ది హండ్రెడ్ లీగ్‌లో కామెంట్రీ చెబుతున్నాడు. అతడు తాజాగా ట్విటర్ లో ఓ ఫోటో షేర్ చేశాడు. అయితే శాస్త్రి ఏ ఉద్దేశంతో ఈ ఫోటో పెట్టాడో గానీ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు మాత్రం ఈ ఫోటోకు నానార్థాలు, ద్వందార్థాలు తీస్తున్నారు.

Mukhesh Ambani, Sundar Pichai Spotted In THE HUNDREAD with Ravi Shastri, Fans Calls Something Is Cooking
Author
First Published Aug 10, 2022, 9:29 AM IST

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి రెండ్రోజుల క్రితం తన ట్విటర్ ఖాతా వేదికగా ఓ ఫోటో షేర్ చేశారు. అందులో ఆయనతో పాటు భారత వ్యాపార సామ్రాజ్యాధినేత ముఖేష్ అంబానీ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌లు ఉన్నారు.  ఇంగ్లాండ్ లో జరుగుతున్న‘ది హండ్రెడ్’లీగ్ లో భాగంగా ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ రవిశాస్త్రి.. ‘ఆగస్టులో క్రికెట్ అంటే మక్కువ చూపించే ఇద్దరు ప్రముఖులతో కలిసి క్రికెట్ పుట్టినిల్లులో మ్యాచ్ చూశాను. ముఖేష్ అంబానీ,  సుందర్ పిచాయ్ లతో ది హండ్రెడ్ లీగ్ లో నేను..’ అని ట్వీట్ చేశాడు. శాస్త్రి ప్రస్తుతం ఈ లీగ్ లో స్క స్పోర్ట్స్ తరఫున కామెంట్రీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

రవిశాస్త్రి ఏ ఉద్దేశంతో ఈ ఫోటో పెట్టాడో గానీ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు మాత్రం ఈ ఫోటోకు నానార్థాలు, ద్వందార్థాలు తీస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు యూఈఏ టీ20లీగ్, సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ లో పెట్టుబడులు పెట్టిన ముఖేశ్ అంబానీ నెక్స్ట్ టార్గెట్ ‘ది హండ్రెడ్’ మీద పడిందని వాదనలు లేవనెత్తుతున్నారు. 

ఇటీవలే ముగిసిన సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ (సీఎస్ఏ టీ20) లో కేప్ టౌన్ ఫ్రాంచైజీని  అంబానీ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  వివిధ దేశాల లీగ్ లలో పెట్టుబడులు పెడుతున్న ఆయన కన్ను ఇప్పుడు ఇంగ్లాండ్ లో విజయవంతంగా దూసుకుపోతున్న ది హండ్రెడ్ లీగ్ మీద పడిందని తెలుస్తున్నది. ఇందులో భాగంగానే  అంబానీ.. ప్రస్తుతం ఇంగ్లాండ్ కు వెళ్లి ఈ లీగ్ విషయాలు, విశేషాలు తెలుసుకుంటున్నాడని సమాచారం. తాజాగా రవిశాస్త్రితో కలిసి ఫోటో దిగడం వెనుక ఉన్న మర్మం కూడా అదే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. 

ఇక సుందర్ పిచాయ్ కూడా  అమెరికాలో త్వరలో ప్రారంభం కానున్న మేజర్ లీగ్ క్రికెట్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని విశ్వసనీయవర్గాలు సమాచారం. టీ20 యుగంలో క్రికెట్ క్రేజ్ నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆటలో పెట్టుబడులు పెట్టేందుకు పిచాయ్ కూడా ఉవ్విళ్లూరుతున్నాడట. వ్యాపార మెలుకువలలో  తనకున్న అనుభవాన్ని క్రికెట్ మీదకు మళ్లించేందుకు సిద్ధమవుతున్నాడని టాక్ వినిపిస్తోంది.

 

ఇంకో ముఖ్యవిషయమేమిటంటే ది హండ్రెడ్ లీగ్ లో ఫ్రాంచైజీలన్నీ ఇప్పటికీ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పరిధిలోనే ఉన్నాయి. వాటిని గతేడాది అమ్మకానికి పెడదామని చూసినా ఎందుకో వీలు పడలేదు.  ఈ మేరకు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సమాచారం అందించినా ఇక్కడి ఓనర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు.  అయితే తాజాగా అంబానీ మాత్రం  ఈ లీగ్ లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నాడట.

మరి ఇందులో ఏది నిజమో..? తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే. కానీ, నిప్పు లేనిదే పొగ రాదు కదా..! రవిశాస్త్రి, అంబానీ, పిచాయ్ కలయిక వెనుక ఏదో జరుగుతుందని మాత్రం విశ్లేషకులు, విమర్శకులు భావిస్తున్నారు. ‘లోగుట్టు పెరుమాళ్‌కెరుక’ అన్నట్టు ఈ  ముగ్గురి కలయిక లోగుట్టు ఎవరు తేల్చుతారో అని అభిమానులు వేచి చూస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios