కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల క్రికెటర్లంతా తమ ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయంలో వారంతా తమ అభిమానులకు కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ... అందరిని ఇండ్లలోనే ఉండమని కోరుతున్నారు. 

ఈ ఖాళీసమయాల్లో అభిమానులతో క్రికెట్ కు సంబంధించి తమ అనుభవాలను పంచుకుంటున్నారు. తాజాగా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా ధోని గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పాడు. ఆటతోపాటు పర్సనల్ లైఫ్ కి కూడా ప్రాధాన్యత ఇచ్చే ధోని క్రికెట్ తరువాత అందుబాటులో ఉండడనేది జగమెరిగిన సత్యం! 

క్రికెట్‌ సీజన్‌ అనంతరం ఎం.ఎస్‌ ధోనితో మాట్లాడటం అంత సులువైన పని కాదు. ఈ విషయం మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు సైతం అనుభవమే. కానీ జట్టుతో ఉన్నప్పుడు ఎం.ఎస్‌ ధోని సహచరులతో మాట్లాడేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండేవాడని మాజీ సహచర పేసర్‌ ఆశీష్‌ నెహ్రా అన్నాడు. 

'ధోని ఎక్కువగా మాట్లాడడు అని జనాలు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. రాత్రి మ్యాచ్‌ అనంతరం అతడి గది తెరిచే ఉంటుంది. ఏ ఆటగాడైనా అతడికి రూమ్‌కు వెళ్లి, ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుని మహితో మాట్లాడవచ్చు. 

జాతీయ జట్టైనా లేదా చెన్నై సూపర్‌ కింగ్స్‌ అయినా.... చోటు ఏదైనా ఓ ఆటగాడి నుంచి తను ఏం ఆశిస్తున్నాడనే సందేశాన్ని మహి స్పష్టంగా పంపేవాడు. అతడితో ఆ సంభాషణ చాలు ఆటగాళ్లకు నమ్మకం ఏర్పడుతుంది' అని నెహ్రా అన్నాడు. ఎం.ఎస్‌ ధోని నాయకత్వంలో నెహ్రా టీమ్‌ ఇండియా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడాడు.

ఇకపోతే... ధోని మాత్రం ఈ లాక్ డౌన్ సమయాన్ని భలేగా ఎంజాయ్ చేస్తున్నాడు. భారత జట్టు మాజీ కెప్టెన్, ఎంఎస్ ధోనీ కూడా తన సతీమణి సాక్షి సింగ్, కుమార్తె జీవాలతో కలిసి రాంచీలోని ఫామ్ హౌస్‌లో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాడు.

చిన్నప్పటి నుంచి బైక్‌లు నడపటం అంటే చాలా ఇష్టపడే ధోనీ లాక్‌డౌన్ సమయంలో కుమార్తె జీవాను బైక్‌పై ఎక్కించుకుని ఇంటి ఆవరణలోనే చక్కర్లు కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ధోనీ భార్య సాక్షి సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ అభిమాన క్రికెటర్‌ను చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ధోనీ ఇల్లు... ఒక డ్రీమ్ హౌస్‌లా ఉందని పలువురు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

షెడ్యూల్ ప్రకారం మార్చి 29న జరగాల్సిన ఐపీఎల్ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదాపడింది. వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిన తర్వాత పరిస్ధితులను బట్టి ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది.