టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. రిటైర్మెంట్ తీసుకుంటున్నారా..? ఎప్పుడు తీసుకుంటున్నారు.? ఒకవేళ తీసుకోకపోతే మళ్లీజట్టులోకి ఎప్పుడు వస్తారు..? గత కొంతకాలంగా ధోనీ గురించి ఇవే ప్రశ్నలు వినపడుతున్నాయి. అయితే... తాజాగా దీనిపై ఓ వార్త వినపడుతుంది. 

వచ్చే ఐపీఎల్ తర్వాతే ధోనీ తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాడని అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ‘‘ ఒకవేళ ధోనీ రిటైర్మెంట్ గురించి నిర్ణయం తీసుకుంటే అది వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాతే. అతడు చాలా పెద్ద ఆటగాడు.  కాబట్టి అతడిపై ఊహాగానాలను ఆపలేం. ఇప్పుడతడు పూర్తి ఫిట్ గా ఉన్నాడు. నెల రోజులుగా కఠోర సాధన చేస్తున్నాడు’’ అని ధోనీ సన్నిహితుడు ఒకరు చెప్పారు.

కాగా...ధోనీ రిటైర్మెంట్ పై రవిశాస్త్రి కూడా తాజాగా స్పందించారు.  2020 ఐపీఎల్ లో ధోనీ ఎలా ఆడతాడు అనే దానిపైనే అతని భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. ధోనీ క్రికెట్ ఆడటం తదిరిగి ఎప్పుడు మొదలుపెడతాడు, వచ్చే ఐపీఎల్ లో అతను ఎలా ఆడతాడన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుందని రవిశాస్త్రి పేర్కొన్నారు,

ఇతరులు వికెట్ కీపింగ్ లో ఎలా రాణిస్తారు, ధోనీతో పోలిస్తే వాళ్ల ఫామ్ ఎలా ఉందన్నది కూడా ముఖ్యమేనని ఆయన అన్నారు. ఐపీఎల్ చాలా పెద్ద టోర్నీ అయిపోయిందన్నారు. ఆ టోర్నీ తర్వాతే 15మంది జట్టు పై అటూ ఇటుగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని  ఆయన అన్నారు.

ప్రపంచకప్ తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ లతో జరిగిన సిరీస్ కి ధోనీ దూరమైన సంగతి తెలిసిందే. ధోనీ భవిష్యత్తు గురించి గత అక్టోబర్ లో అడిగినప్పుడు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నామని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు.