ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న టీమిండియా మాజీ కెప్టెన్, కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ నుంచి కూడా తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పష్టత లేనప్పటికీ ఆ ఫ్రాంఛైజీకి తన తర్వాత ఎవరు కెప్టెన్‌గా ఉండాలనే అంశంపై మహీ తీవ్రంగా ఆలోచిస్తున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో అన్నాడు.

ఓ మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. ధోనీ తర్వాత చెన్నైకి కెప్టెన్‌గా ఎవరు ఉండాలనే విషయంపై ఇప్పటికే కొద్దిరోజులుగా ఆలోచిస్తున్నాడని బ్రావో వెల్లడించాడు.

ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఆట నుంచి తప్పుకోవాలని. అయితే ఎప్పుడు తప్పుకోవాలనేదే ముఖ్యమైన విషయం. తన తర్వాత కెప్టెన్సీ పగ్గాలను రైనాకు లేదా మరో యువ ఆటగాడికి అప్పగించే అవకాశం వుందని బ్రావో పేర్కొన్నాడు.

ఇదే సమయంలో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ గురించి స్పందించిన బ్రావో.. ఈ ప్రభావం ఐపీఎల్‌లో అతడి కెప్టెన్సీపై పడదని పేర్కొన్నాడు. ఇతరుల గురించి ధోనీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అతని వ్యవహార శైలిలో ఎటువంటి మార్పులు ఉండవని తెలిపాడు.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఇటీవలే క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ జట్టులో కరోనా బారినపడిన ఇద్దరు  ఆటగాళ్లు మినహా మిగిలిన అందరూ మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ధోనీ సైతం ప్రాక్టీస్‌లో సిక్సులు బాదుతున్నాడు.