Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ 2023 కోసం ప్రాక్టీస్ మొదలెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ... ఆఖరి సీజన్‌లో టైటిల్‌ గెలిచి...

ఐపీఎల్ 2023 సీజన్ కోసం రెండు నెలల ముందు నుంచే నెట్ ప్రాక్టీస్ మొదలెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ... మాహీకి ఆఖరి ఐపీఎల్ సీజన్‌గా 2023.. 

MS Dhoni started batting Practice for IPL 2023 Season, CSK Skipper last season CRA
Author
First Published Jan 20, 2023, 3:37 PM IST | Last Updated Jan 20, 2023, 3:37 PM IST

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా ఐపీఎల్ తప్ప మరే సిరీస్‌లోనూ ఆడడం లేదు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. 9 నెలల పాటు క్రికెట్‌కి దూరంగా వ్యక్తిగత జీవితం గడుపుతున్న ధోనీ, ఐపీఎల్‌కి ముందు బ్యాటు పట్టుకుని ప్రాక్టీస్ చేయడం మొదలెడుతుండేవాడు...

సాధారణంగా ఐపీఎల్ షెడ్యూల్ వచ్చాక, సీజన్ ప్రారంభం కావడానికి నెల రోజుల ముందు బ్యాటు పట్టుకునే మహేంద్ర సింగ్ ధోనీ, ఈ ఏడాది రెండున్నర ముందుగానే ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. గత ఏడాది ఐపీఎల్ ఆరంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు మహేంద్ర సింగ్ ధోనీ...

అయితే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి 8 మ్యాచులకు సారథ్యం కూడా వహించిన రవీంద్ర జడేజా ఇంప్రెస్ చేయలేకపోయాడు. 8 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకోవడంతో జడ్డూ ప్లేస్‌లో తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు ధోనీ..

అయితే మాహీ కెప్టెన్సీలోనూ చెన్నై సూపర్ కింగ్స్ విజయాల బాట పట్టలేకపోయాడు. మహేంద్రుడి సారథ్యంలో 6 మ్యాచులు ఆడి రెండు విజయాలు అందుకుని... మొత్తంగా 14 మ్యాచుల్లో 4 విజయాలు, 10 పరాజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచి సీజన్‌ని ముగించింది...

2023 సీజన్‌తో మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని మాహీ కూడా ప్రకటించాడు. ఆఖరి సీజన్‌లో టైటిల్ గెలిచి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ కెప్టెన్‌గా రిటైర్ అవ్వాలని కోరుకుంటున్నారు ధోనీ అభిమానులు...

తాజాగా ఐపీఎల్ 16వ సీజన్ కోసం ప్రాక్టీస్ మొదలెట్టేశాడు ధోనీ. రాంఛీలో నెట్స్‌లో ధోనీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2020 సీజన్‌ కోసం యూఏఈ చేరుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...

2020 సీజన్‌తోనే మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరిగింది. అయితే 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి నాలుగో టైటిల్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ, 2022లోనూ పాల్గొన్నాడు. 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సొంత అభిమానుల మధ్య చెపాక్ స్టేడియంలో ఆఖరి మ్యాచ్ ఆడి రిటైర్మెంట్ తీసుకుంటానని స్పష్టం చేశాడు ధోనీ..

కరోనా కారణంగా గత మూడు సీజన్లలో సొంత గ్రౌండ్‌లో మ్యాచులు ఆడలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి అన్ని ఇబ్బందులు తొలిగిపోవడంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో 10 నగరాల్లో పాత పద్ధతిలో నిర్వహించాలని అనుకుంటున్నారు నిర్వాహాకులు. ఐపీఎల్ 2023 సీజన్‌లో రవీంద్ర జడేజాతో పాటు బెన్ స్టోక్స్, అజింకా రహానే, మహేంద్ర సింగ్ ధోనీ కలిసి చెన్నైసూపర్ కింగ్స్ తరుపున ఆడబోతున్నారు...

ఐపీఎల్ 2023 మినీ వేలంలో భారీ ధర పెట్టి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ని కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత బెన్ స్టోక్స్, సీఎస్‌కే కెప్టెన్‌గా కొనసాగుతాడని ఇప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios