రాంచీ: మైదానంలోకి దిగడానికి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పూర్తిగా సిద్దమవుతున్నాడు. ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోనీ తన జట్టును ముందుండి నడిపించడానికి సిద్ధపడుతున్నాడు. అయితే, ఈలోగా ధోనీకి సంబంధించన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

రాంచీలోని జేఎస్సీఏ స్టేడియంలో పిచ్ రోలర్ నడుపుతున్న ధోనీ వీడియో వైరల్ అవుతోంది. 38 ఏళ్ల ధోనీ ప్రాక్టీస్ పిచ్ పై రోలర్ ను డ్రైవ్ చేస్తూ కనిపించాడు. జార్ఖండ్ రంజీ ట్రోఫీ ఆటగాళ్లతో కలిసి ఇటీవల ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.

 

వచ్చే ఐపిఎల్ కోసం సురేష్ రైనాతో కలిసి ధోనీ మార్చి 3వ తేదీ నుంచి ఏర్పాట్లు చేసుకుంటాడు. ధోనీ మార్చి 2వ తేదీన చెన్నై చేరుకంటాడని, మర్నాడు 3వ తేదీ నుంచి ఎంఎ చిదంబరం స్టేడియంలో శిక్షణ ప్రారంభిస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కెఎస్ విశ్వనాథన్ చెప్పారు. ధోనీతో పాటు రైనా కూడా ట్రైనింగ్ లో పాల్గొంటాడని ఆయన చెప్పారు.

2019 ప్రపంచ కప్ టోర్నీలో న్యూజిలాండ్ పై సెమీ ఫైనల్ లో ఓడిపోయిన తర్వాత ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగానే ఉన్నాడు. ఐపిఎల్ 2020 ప్రారంభంతో ఆయన తిరిగి మైదానంలోకి దిగనున్నాడు.