టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కుటుంబంలో కరోనా వైరస్ కలకలం రేపింది. ధోనీ తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. ధోనీ తల్లి దేవకీ దేవి, తండ్రి పాన్ సింగ్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. 

ప్రస్తుతం వారిద్దరిని రాంచీలోని పల్స్‌ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2021లో భాగంగా ధోని ప్రస్తుతం సీఎస్‌కే కెప్టెన్‌గా బిజీగా ఉన్నాడు. నేడు చెన్నై, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌ జరుగనుంది.


ఇక, బయో బబుల్‌ నిబంధనల నడుమ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా గతేడాది  2020 లో యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కే, ప్లే ఆఫ్స్‌ దశలోనే నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. మూడుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా, దాదాపు ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన సూపర్‌కింగ్స్‌ లీగ్‌ దశలోనే వెనుదిరగడం టోర్నీ చరిత్రలో అదే మొదటిసారి. టోర్నీ ఆరంభానికి ముందే ఆటగాళ్లు కరోనా బారిన పడటం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక టోర్నీ నుంచి జట్టు నిష్క్రమించిన తర్వాత ధోని కుటుంబానికే సమయం కేటాయించాడు.