మహేంద్ర సింగ్ ధోని...ఈ పేరు చెప్పగానే మనందరికి ముందుగా గుర్తోచ్చే క్రికెట్ షాట్ హెలికాప్టర్ సిక్స్. యార్కర్ బంతులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటూ దాన్ని బౌండరీకి తరలించడానికి ధోని ఉపయోగించే షాటే ఈ హెలికాప్టర్ సిక్స్. ఎవరికి సాధ్యం కాని విధంగా సాంప్రదాయ క్రికెట్ షాట్లకు కాస్త భిన్నంగా వుండే దీన్ని ధోని తప్ప ఇంకెవరూ వాడటానికి సాహసించరు. కానీ ఈ ఐపిఎల్ లో ధోని కాకుండా మరో క్రికెటర్ కూడా ఆ హెలికాప్టర్ షాట్ తో అలరించాడు. అది కూడా ధోని కళ్లెదుటే కావడం విశేషం. 

బుధవారం  ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య జట్టు అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో రాణించి ఐపిఎల్ లో చిరస్మరణీయమైన 100వ విజయాన్ని అందుకుంది. ఇలా జట్టు విజయాన్ని అందుకుంది అనేబదులు హార్ధిక్ పాండ్యా ఆల్ రైండ్ ప్రదర్శనతో ముంబై జట్టుకు విజయాన్ని అందించాడు అనాలి. 

పాండ్యా ముంబై బ్యాట్ మెన్స్ పరుగుల కోసం కష్టపడుతూ వికెట్లు చేజార్చకుంటున్న సమయంలో క్రీజులోకి గౌరవప్రదమైన స్కోరు దిశగా జట్టును నడిపించాడు.  కేవలం 8 బంతుల్లో 25 నాటౌట్‌ ( 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆ తర్వాత బౌలింగ్‌లో (3/20) తో పాండ్యా చెలరేగడంతో ముంబై జట్టు చెన్నై ని ఓడించింది. అయితే ఇలా ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగిన పాండ్యా చెన్నై కెప్టెన్, వికెట్ కీఫర్ ధోని ఎదురుగానే హెలికాప్టర్ షాట్ బాది ఆశ్చర్యానికి గురిచేశాడు. బ్రావో యార్కర్ ని అచ్చం ధోని స్టైల్లో పాండ్యా హెలికాప్టర్ షాట్ బాది బంతిని బౌండరీ అవతలికి తరలించాడు. ధోని కూడా ఇంప్రెస్ అయ్యేలా వున్న సిక్సర్ మ్యాచ్‌ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. 

ఈ మ్యాచ్ అనంతరం ధోనిని ఉద్దేశించి పాండ్యా ఓ ట్వీట్ చేశారు. 'ధోని ముందు హెలికాప్టర్‌ షాట్‌ కొట్టడం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది.  ఈ షాట్‌ గురించి ఎంఎస్‌ నన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటాడని ఆశిస్తున్నా'  అంటూ పాండ్యా తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశాడు.