జార్ఖండ్ డైనమైట్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి అరుదైన అవకాశం లభించింది. ఐసిసి వన్డే ప్రపంచ కప్ తర్వాత అతడు భారత జట్టుకు దూరంగా కుటుంబానికి దగ్గరగా వుంటున్నాడు. దేశసేవలో ప్రత్యక్షంగా పాలుపంచుకోవాలనుకున్న దృడసంకల్పంతో అతడు భారత ఆర్మీలో కొన్నాళ్ళపాటు పనిచేశాడు. దీంతో అతడిపై దేశప్రజల్లో మరింత గౌరవం పెరిగింది. 

అయితే ఇలా ఆర్మీలో పనిచేసేందుకు వెస్టిండిస్ పర్యటనకు దూరంగా వున్న ధోని తాజాగా ఫ్యామీలీతో గడపడానికి సౌతాఫ్రికా సీరిస్ కు దూరమయ్యాడు. భార్య సాక్షి, కూతురు జీవాలతో కలిసి అతడు రాంచీలోనే సరదగా గుడపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి గత ఆదివారం అరుదైన గౌరవం లభించింది. 

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రస్తుతం జార్ఖండ్ లో పర్యటిస్తున్నారు. ఆదివారం ఆయన గుమ్లా జిల్లాలో పర్యటించాల్సి వుండగా భారీ వర్షాల కారణంగా అది రద్దయ్యింది. దీంతో ఆయన రాంచీలోని రాజ్‌భవన్ లో బసచేశారు. ఈ సందర్భంగా ధోనికూడా రాంచీలోనే వున్నట్లు తెలుసుకున్న కోవింద్ రాత్రి విందుకు ఆయన్ని ఆహ్వానించారు. అనూహ్యంగా రాష్ట్రపతి నుండి పిలుపు రావడంతో ధోని కూడా తన కార్యక్రమాలన్నింటిని రద్దు చేసుకుని ఆ విందుకు హజరయ్యారు.ఈ విందులో జార్ఖండ్ కు చెందిన మరికొంతమంది ప్రముఖులు కూడా పాల్గొన్నారు.  

ఇవాళ(సోమవారం) ఉదయం రాంచీ యూనివర్సిటీ 33 స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాత్రే ధోనికి పలు సూచనలు చేసినట్లు అవి మీకు కూడా చాలా ఉపయోగపడతాయని అన్నారు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి వుండే లక్షణమే ధోనిని చాలామంది అభిమానులకు దగ్గర చేసిందని... మీరు కూడా అలాగే వుండాలని కోవింద్ విద్యార్థులకు సూచించారు.