Asianet News TeluguAsianet News Telugu

కొబ్బరి బొండాం పట్టుకుని డ్రెస్సింగ్‌ రూమ్‌కి వచ్చిన ‘మిస్టర్ కూల్’ ఎంఎస్ ధోనీ... హార్ధిక్ రియాక్షన్ ఏంటంటే...

రాంఛీలో న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడనున్న భారత జట్టు... డ్రెస్సింగ్ రూమ్‌లోకి కొబ్బరి బొండాంతో ఎంట్రీ ఇచ్చి, టీమిండియా ప్లేయర్లతో ముచ్చటించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. 

MS Dhoni meets Hardik Pandya and Team India in Ranchi before India vs New Zealand 1st T20I CRA
Author
First Published Jan 27, 2023, 11:31 AM IST

వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ని క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, టీ20 సిరీస్ కోసం సిద్ధమవుతోంది. టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ రాంఛీ వేదికగా జరగనుంది. రెండు రోజుల ముందే రాంఛీ చేరుకున్న భారత జట్టును, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కలిసి మాట్లాడాడు...

రాంఛీలో నివాసం ఉంటున్న మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ 2023 సీజన్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. తన ప్రాక్టీస్ సెషన్స్ కోసం వచ్చిన ధోనీ, టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి.. ప్లేయర్లతో కాసేపు మాట్లాడాడు. చేతిలో కొబ్బరి బొండాం పట్టుకుని కూల్‌గా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన ధోనీని చూసి టీమిండియా సభ్యులంతా షాక్‌కి గురయ్యారు...

టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యాతో పాటు రాంఛీ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌తో కాసేపు మాట్లాడాడు మహేంద్ర సింగ్ ధోనీ. మాహీ ఏం మాట్లాడాడు? అనే విషయాలు వినిపించకుండా మ్యూజిక్‌ని జత చేసి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది భారత క్రికెట్ బోర్డు...

‘చూడండి భారత జట్టును ఎవరు కలిశారు.. గ్రేట్ ఎంఎస్ ధోనీ’ అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది బీసీసీఐ. భారత ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో పాటు స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌ని కూడా కలిశాడు మహేంద్ర సింగ్ ధోనీ. మొదటి టీ20 మ్యాచ్‌కి ముందు ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్న హార్ధిక్ పాండ్యా, ధోనీ రాకపై కూడా స్పందించాడు..

‘మ్యాచ్ ఆరంభానికి ముందు మాహీ భాయ్‌ని కలవడం చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా ధోనీని కలవడానికి బయట హోటల్‌కి వెళ్తూ ఉంటాం. గత నెల రోజులుగా హోటల్ నుంచి హోటల్‌కి మారుతూ మ్యాచులు ఆడుతున్నాం.. ధోనీతో ఏం మాట్లాడారని అందరూ అడుగుతారు...

సాధారణంగా మాహీ భాయ్ క్రికెట్ గురించి ఎక్కువగా మాట్లాడరు. ఆయన ఎక్కువ జీవితం గురించే చెబుతూ ఉంటారు. ఆ విలువైన విషయాలు అందరూ నేర్చుకోవాలి. ఆయన దగ్గర్నుంచి వీలైనంత జ్ఞానాన్ని  పొందాలని అనుకుంటాను. నా వరకూ మొత్తం లాగేశాననే అనుకుంటా...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా...

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఓపెనర్‌గా ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్, మోచేతి గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అయితే శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లను ఓపెనర్లుగా కొనసాగిస్తామని చెప్పిన హార్ధిక్ పాండ్యా, పృథ్వీ షా ఇంకొన్ని రోజులు ఎదురుచూడక తప్పదని కామెంట్ చేశాడు...

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో టీ20 ఆరంగ్రేటం చేసిన శుబ్‌మన్ గిల్, మొదటి మూడు మ్యాచుల్లో పెద్దగా మెప్పించలేకపోయాడు. బంగ్లాదేశ్‌తో వన్డేలో డబుల్ సెంచరీ చేసి టీ20 సిరీస్‌లో ఓపెనింగ్ చేసిన ఇషాన్ కిషన్ కూడా శ్రీలంకపై చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు.

ఈ ఇద్దరూ టీ20ల్లో వరుసగా విఫలం అవుతుండడంతో రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా వంటి ప్లేయర్లకు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో చోటు కల్పించారు సెలక్టర్లు. అయితే పాండ్యా మాత్రం శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios