ఐపీఎల్ వాయిదా పడిపోవడం, ఎటువంటి స్పోర్ట్స్ ఈవెంట్లు ;లేకపోవడం ఇవన్నీ వెరసి కొద్దిగా వెనుక సీట్లో ఉండిపోయిన ధోని రిటైర్మెంట్ అంశాన్ని మరోసారి లైం లైట్ లోకి తెచ్చింది. 

క్రికెటర్లు, మాజీలు, విశ్లేషకులు కూడా ఆట లేక ఇండ్లలో ఖాళీగా ఉండడం, సోషల్ మీడియా వేదికలు ఎక్కువయిపోవడం అన్ని వెరసి ధోని రిటైర్మెంట్ అంశం నుంచి మొదలుకొని ధోని కెరీర్ వరకు అన్ని చర్చకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇవి ట్రేండింగ్ గా కూడా మారుతున్నాయి. 

2004లో ఎం.ఎస్‌ ధోని భారత క్రికెట్‌ జట్టు తరఫున వన్డేల్లో అరంగ్రేటం చేశాడు. ధోనికి ముందు భారత క్రికెట్‌ జట్టులో మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబయి, చెన్నైలకు చెందిన క్రికెటర్లు మాత్రమే రెగ్యులర్‌ ప్లేయర్స్‌గా కొనసాగుతుండేవాళ్లు. 

ధోని తర్వాత భారత క్రికెట్‌ పవర్‌ డైనమిక్స్‌లో మార్పులు వచ్చాయని మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నారు. భారత జట్టులోకి ధోని వచ్చిన తర్వాత క్రికెట్‌ పవర్‌ డైనమిక్స్‌లో మార్పులు మొదలయ్యాయని చిక్క అభిప్రాయపడ్డాడు. 

ఓ ఈశాన్య సెలక్టర్‌ రాంచీ కుర్రాడిలో ప్రత్యేకతను గుర్తించాడని, తొలుత 2-3 మ్యాచుల్లో నిరాశపరచగానే ప్రతికూల కథనాలు కూడా ధోని పై రాసేశారని.... కానీ,పాకిస్థాన్‌పై వైజాగ్‌లో ధోని చేసిన 148 ఇన్నింగ్స్‌ అన్నిటిని ఒక్కసారిగా మార్చివేసిందని ఈ మాజీ దిగ్గజం అభిప్రాయపడ్డాడు. 

ఆ ఇన్నింగ్స్ ధోనిలో విశ్వాసం పెంచిందని,  అది కేవలం ధోని ఒక్కడికే లభించడం కాకుండా భారత క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చివేసిందని వ్యాఖ్యానించాడు. ధోని తర్వాత భారత జట్టులోకి చిన్న నగరాల నుంచి ఎంతో మంది రావటం మొదలైందని చిక్కా అన్నాడు. 

ధోని నెలకొల్పిన ఈ వారసత్వం ఎంతో ఘనమైనదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.  ధోని తరువాత, ధోని చూపిన బాటలో ఎందరో యువ క్రికెటర్లు తాము సైతం కష్టపడితే జాతీయ జట్టులో చోటు దక్కించుగోళం అని నమ్మరని, అదే ఇప్పుడు రుజువైందని అన్నాడు. 

సరైన సమయంలో నాయకత్వ పగ్గాలను ధోని విరాట్‌ చేతికి అందించాడని శ్రీకాంత్‌ కొనియాడాడు. ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీ ట్రోఫీలు (వన్డే వరల్డ్‌కప్‌, టీ20 వరల్డ్‌కప్‌, చాంపియన్స్‌ ట్రోఫీ) సాధించిన ఏకైక నాయకుడిగా ధోని ఎదురులేని రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.