ఇంగ్లాండ్ వేదికన జరిగిన వన్డే ప్రపంచ కప్ తర్వాత సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని భారత జట్టుకు దూరమయ్యాడు. ఈ మెగా టోర్నీ తర్వాత అతడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై  చెప్పి పూర్తిగా దూరమవనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేకపోయినా వ్యక్తిగత కారణాలతో కొంతకాలం మాత్రం జట్టుకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇప్పటికే అతడు జట్టులో చేరాల్సివుండగా అలా జరగలేదు.  ధోని పునరాగమనం మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని బిసిసిఐ అధికారి ఒకరు తెలియజేశారు. 

ప్రపంచ కప్ తర్వాత దేశ ఆర్మీలో పనిచేయాలన్న కుతూహలంతో ధోని వెస్టిండిస్ పర్యటనకు దూరమయ్యాడు. అయితే ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో  జరుగుతున్న సీరిస్ కు కూడా అతడు దూరమయ్యాడు. అలాగే మరికొన్నిరోజుల్లో బంగ్లాదేశ్ తో జరగనున్న  సీరిస్ కు అతడు దూరమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే ధోని ఈ సీరిస్ కు అందుబాటులో వుండటంలేదట. ఈ మేరకు భారత సెలెక్షన్ కమిటీకి సమాచారం అందినట్లు సదరు బిసిసిఐ అధికారి వెల్లడించారు.

సౌతాఫ్రికాతో ఇప్పటికే టీ20 సీరిస్ ముగిసింది. అక్టోబర్ మొత్తం టెస్ట్ సీరిస్ జరగనుంది. ఆ తర్వాత నవంబర్ లో టీమిండియా బంగ్లాదేశ్ తో మూడు టీ20, రెండు టెస్ట్  లు ఆడనుంది. ఈ సీరిస్ లో కూడా ధోని ఆటను చూసే అవకాశం లేదన్నమాట. ఇప్పటికే టెస్ట్ లకు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి మూడు టీ20 మ్యాచులకు మాత్రమే దూరం కానున్నాడు. 

ధోని రిటైర్మెంట్ పై అభిమానులు ఇప్పటికీ డైలమాలోనే వున్నారు. వెస్టిండిస్ పర్యటనను కాదని  భారత ఆర్మీలో పనిచేయడానికి సిద్దమైన ఆయన తాత్కాలికంగా  జట్టు నుండి తప్పకున్నాడు. అయితే ఆ తర్వాత జరిగే సీరిస్ లకు అతడు అందుబాటులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ అలా జరగడం లేదు. దీంతో అనధికారికంగా అతడి రిటైర్మెంట్ అమలవుతుందా అన్న అనుమానం అభిమానుల్లో నెలకొంది.