టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ గురించి అందరికీ తెలుసు. ఆ రెండింటిలోనూ ఆయన ఆరితేరారు. అయితే... తాజాగా ఆయన తనలోని కొత్త టాలెంట్ ని బయటపెట్టారు. సింగర్ గా కొత్త అవతారం ఎత్తాడు. కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన కార్యక్రమంలో స్నేహితుడితో కలిసి గొంతు కలిపాడు. బాలీవుడ్‌ చిత్రం జుర్మ్‌లో 'జబ్‌ కోయ్‌ బాత్‌ బిగాద్‌ జయా' పాటను పాడాడు. 

కాగా... ధోనీ పాట పాడుతుండగా తీసిన వీడియోని ఆయన స్నేహితురాలు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ''హెచ్చరిక: ఇది చూడటానికి ధైర్యం కావాలి. మహీకి ఎంతో అద్భుతమైన ప్రతిభ ఉంది. మహీ.. ఈ వీడియో పోస్ట్‌ చేసినందుకు నన్ను ఏమీ అనొద్దు. తప్పక షేర్‌ చేయాల్సి వచ్చింది'' అని పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొద్దిక్షణాల్లోనే ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

 

ఇదిలా ఉండగా... ధోనీ ప్రపంచకప్ తర్వాత మళ్లీ బ్యాట్ పట్టింది లేదు.. వరల్డ్ కప్ తర్వాత ఆయన రిటైర్మెంట్ తీసుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. వాటిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.