TATA IPL 2022: ‘బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయి..’ అని తెలుగులో పాత సామెత ఒకటుంది. ఐపీఎల్ లో  అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్న  ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లకు ఈ సీజన్ లో పై సామెత అతికినట్టు సరిపోతుంది. 

ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆ రెండు జట్లదే తిరుగులేని ఆధిపత్యం. ప్రతి సీజన్ లో ఈ రెండు జట్లలో ఏదో ఒక జట్టు.. కనీసం ప్లేఆఫ్స్ వరకైనా వెళ్లాయి. ఇప్పటివరకు 14 సీజన్లు ముగిసిన ఐపీఎల్ లో ఈ రెండు జట్లే 9 సార్లు కప్ ను ఎగరేసుకుపోయాయి. ముంబై ఐదు సార్లు విజేత కాగా.. చెన్నై నాలుగు సార్లు గెలిచింది. ట్రోఫీల సంగతి పక్కనబెట్టినా చెన్నై గడిచిన 14 సీజన్లలో.. నాలుగు సార్లు రన్నరప్, రెండు సార్లు ప్లేఆఫ్స్. ముంబై కూడా అంతే.. కానీ ఇదంతా చరిత్ర. ఇప్పుడు ఈ రెండు జట్లు కనీసం ప్లేఆఫ్ కూడా వెళ్లడానికి వీళ్లేదు.

మరోవైపు ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్. గతేడాది ముగిసిన ఐపీఎల్ కొత్త జట్ల బిడ్డింగ్ లో లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలను చేజిక్కించుకున్న ఈ రెండు జట్లు.. ఈ సీజన్ లో పాయింట్ల పట్టికలో టాప్-2 లో ఉన్నాయి. 

ఈ రెండు జట్లు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్లేయర్లను రిటైన్ చేసుకుని.. జట్టుగా రూపాంతరం చెందిన తర్వాత కూడా ‘వీళ్లు ప్లేఆఫ్ చేరడం సంగతి పక్కనబెడితే కనీసం ఐదారు మ్యాచులు గెలిచినా గొప్పే..’, ‘ఆ జట్ల ఆటగాళ్లను చూస్తే ప్లేఆఫ్ చేరితే అదే పదివేలు. ఇప్పటికే పాతుకుపోయి ఉన్న చెన్నై, ముంబై, బెంగళూరు వంటి జట్ల మధ్య ఇవి నిలబడటం కష్టమే..’ అని కామెంట్స్ వినబడ్డాయి. కానీ కాలచక్రం గిర్రున తిరిగింది. నెలరోజుల్లో అంతా తలకిందులైంది. 

కాలం కలిసిరాక.. 

ఐపీఎల్ లో ఇప్పటివరకు 49 మ్యాచులు ముగిశాయి. అంటే సీజన్ దాదాపు రెండో దశలో కూడా సగానికి పైగా ముగిసినట్టే. ముంబై ఇండియన్స్ మినహా అన్ని జట్లు 10 మ్యాచులు ఆడాయి. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ లు టాప్-2 లో ఉండగా.. అత్యంత విజయవంతమైన జట్లుగా పేరున్న చెన్నై, ముంబై లు 9, 10 స్థానాల్లో నిలిచాయి.

‘ఈ జట్లు గెలుస్తాయా...?’ అన్న విమర్శలను పట్టించుకోని గుజరాత్, లక్నోలు దూకుడుగా సాగుతున్నాయి. ఈ సీజన్ లో పది మ్యాచులాడిన గుజరాత్ రెండే మ్యాచులు ఓడింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ఆటతీరుతో సాగుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ స్థానాన్ని అందరికంటే ముందుగా ఖాయం చేసుకుంది. లక్నో కూడా అదే దృక్పథంతో ముందుకు సాగుతున్నది. బ్యాటింగ్ లో తక్కువ స్కోరులే చేసినా వాటిని బౌలింగ్ లో కాపాడుకుంటున్నది. లో స్కోరింగ్ గేమ్ లను కూడా అద్భుత బౌలింగ్, ఫీల్డింగ్ తో కాచుకుంటున్నది.

ఇదిలాఉండగా.. ఆడిన 8 మ్యాచులలో 8 ఓడిన ముంబై ఇండియన్స్.. ఈ ఐపీఎల్ నుంచి ప్లేఆఫ్స్ ఆశలు కోల్పోయిన తొలి జట్టుగా నిలిచింది. ఎట్టకేలకు రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్ లో గెలిచి పరువు కాపాడుకుంది. చెన్నై పరిస్థితీ అంతే. తాము ఆడిన తొలి మ్యాచ్లోనే కోల్కతా చేతిలో ఓడిన సూపర్ కింగ్స్.. తర్వాత అదే అద్వాన్న ఆటతీరుతో 7 పరాజయాలు చవిచూసి.. ముంబై బాటలోనే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించారు. ఇక ఈ జట్లు తాము ఆడబోయేది ఇతర జట్ల ఫలితాలను తారుమారు చేయడానికే తప్ప గెలిచినా, ఓడినా వాటికి మిగిలేది శూణ్యం. 

Scroll to load tweet…

కోల్కతాదీ అదే పరిస్థితి.. 

ముంబై, చెన్నై అంత కాకపోయినా ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఛాంపియన్ జట్టే. ఆ జట్టు కూడా 2012, 2014లో ఛాంపియన్లు గా నిలిచింది. 2021 లో రన్నరప్ కాగా.. మూడు సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. అయితే ఈ సీజన్ లో కొత్త కెప్టెన్ వచ్చినా ఆ జట్టు రాత మారలేదు. ఆడిన 10 మ్యాచులలో 4 మాత్రమే గెలిచి.. ఆరింటిలో ఓడింది. ఇంకా ఈ సీజన్ లో అది మరో నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్ చేరాలంటే ఆ నాలుగు గెలిచినా కేకేఆర్ కు సరిపోదు. టాప్-4లో ఉన్న జట్ల విజయాలు, పాయింట్లు, నెట్ రన్ రేట్ కూడా కేకేఆర్ ప్లేఆఫ్ అవకాశాలపై ప్రభావం చూపుతాయి. 

పని అయిపోయినట్టేనా..? 

ఐపీఎల్ చరిత్రలో ఈ మూడు జట్లు.. 11 సార్లు విజేత (మూడు కలిసి) లుగా నిలిచాయి. ఈసారి మాత్రం లీగ్ స్టేజ్ లోనే ఇంటి ముఖం పడుతున్నాయి. అయితే ఆటలో గెలుపోటములు సహజం. ఈ సీజన్ ముగిసినంత మాత్రానా వాటి పని అయిపోయిందనడానికి లేదు. 2020లో లీగ్ స్టేజ్ కూడా దాటని సీఎస్కే.. 2021 లో ఛాంపియన్ గా నిలిచింది. 2018లో లీగ్ స్టేజ్ లోనే ఇంటి ముఖం పట్టిన ముంబై.. ఆ తర్వాత రెండేండ్లు ట్రోఫీ విజేత. కోల్కతా కథా ఇదే. ఈ సీజన్ లో ఓడినంత మాత్రానా వాటి విలువ పడిపోయిందేమీ లేదు. వచ్చే సీజన్ లో మరింత రాటుదేలి ఐపీఎల్ ను రసవత్తరంగా మార్చుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతానికి ఓడలైన బండ్లు.. తిరిగి ఓడలు కావాలని ఆశిద్దాం.