Asianet News TeluguAsianet News Telugu

తిలకం పెట్టుకోవడానికి నిరాకరించిన సిరాజ్, ఉమ్రాన్ మాలిక్... పాకిస్తాన్‌కి పంపించాలని రచ్చ చేస్తూ..

తిలకం పెట్టి భారత క్రికెటర్లను ఆహ్వానించిన హోటల్ సిబ్బంది... విక్రమ్ రాథోడ్‌తో సహా తిలకం పెట్టుకునేందుకు నిరాకరించిన సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.. 

Mohammed siraj, Umran Malik gets trolls after refused wear tilak, India vs Australia cra
Author
First Published Feb 4, 2023, 5:04 PM IST


భారతదేశం భిన్న కులాలు, విభిన్న మతాల సమ్మేళనం. అయితే టీమిండియాలోకి వచ్చిన తర్వాత అందరూ క్రికెటర్లే. కుల మతాలకు, ప్రాంతీయ భేదాలకు టీమ్‌లో ప్లేస్ ఉండదు. అయితే ప్రేక్షకులు మాత్రం క్రికెటర్లలో అనేక వ్యత్యాసాలు చూస్తారు, ప్రాంతాల వారీగా విభేదాలు సృష్టించారు...

తాజాగా టీమిండియాకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ని ముగించుకున్న భారత జట్టు, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం నాగ్‌పూర్‌లో బీసీసీఐ క్యాంపులో చేరింది. నాగ్‌పూర్‌కి చేరుకున్న భారత జట్టుకి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు  నాగ్‌పూర్‌లోని హోటల్ సిబ్బంది...

హిందూ సంప్రదాయం ప్రకారం ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ అందరికీ తిలకం పెట్టి స్వాగతం పలికింది సదరు హోటల్... అయితే భారత బృందంలోని మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్... తిలకం పెట్టుకోవడానికి నిరాకరించారు. వీరితో పాటు భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, హరిప్రసాద్ కూడా తిలకం పెట్టుకోవడానికి ఇష్టపడలేదు...

అయితే మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌ ముస్లిం మతానికి చెందినవారు కావడంతో వీరిపై విద్వేషకర రీతిలో కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు.  దీంతో మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌... ఇద్దరూ కూడా టీమిండియా తరుపున ఆడేందుకు అర్హులు కాదని, వీరిని వెంటనే టీమ్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది ఓ వర్గం...

అయితే ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్‌లకు టీమిండియా ఫ్యాన్స్ నుంచి పూర్తి సపోర్ట్ దక్కుతోంది. ఆస్ట్రేలియా 2020-21 టూర్ సమయంలో తండ్రి చనిపోతే, ఆయన్ని కడసారి చూపు కూడా చూసుకోకుండా టీమిండియా కోసం క్రికెట్ ఆడి, 13 వికెట్లు తీసి సిరీస్ గెలిపించిన మహ్మద్ సిరాజ్ దేశభక్తిని, మత విధానాలతో ముడి పెట్టడం సరికాదని పోస్టులు పెడుతున్నారు...

అలాగే ఉమ్రాన్ మాలిక్, ఇంతకుముందు చాలాసార్లు సంతోషంగా తిలకం పెట్టుకున్నాడని, అందులో అతను ఎలాంటి ఇబ్బంది పడలేదని పాత ఫోటోలను కూడా పోస్టు చేస్తున్నారు. చాలా చిన్న చిన్న విషయాలను బూతద్ధంలో చూపించి, క్రికెటర్లపై విధ్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్న వారిలో ఓ టీవీ ఛానెల్ చీప్ ఎడిటర్ కూడా ఉండడం విశేషం.. 

దేశం తరుపున ఆడే క్రికెటర్లు, అన్ని మతాల ఆచారాలను ఆచరించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. తిరువనంతపురంలో  మ్యాచ్ జరిగితే కొందరు క్రికెటర్లు అనంతపద్మనాభ స్వామి ఆలయన్ని దర్శించుకున్నారు. భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా వంటి ప్లేయర్లు... గుడికి వెళలేదు. అప్పుడు ఏవ్వరూ ట్రోల్ చేయలేదు. ఎందుకు రాలేదని ప్రశ్నించలేదు. మరి ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్ విషయంలో మాత్రం ఎందుకు ఇలా ఎత్తి చూపిస్తున్నారని నిలదీస్తున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్.. 

Follow Us:
Download App:
  • android
  • ios