Asianet News TeluguAsianet News Telugu

ఐదో టీ20 పాకిస్తాన్‌దే.. 150 కూడా కొట్టలేకపోయిన ఇంగ్లాండ్ హిట్టర్లు

PAK vs ENG T20I: పాకిస్తాన్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఏడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఆతిథ్య జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. లాహోర్ వేదికగా జరిగిన  ఐదో మ్యాచ్ లో  పాక్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Mohammed Rizwan and  Aamer Jamal Stars As Pakistan Records Thrilling Victory Against England
Author
First Published Sep 29, 2022, 9:59 AM IST

ఏడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ వచ్చిన ఇంగ్లాండ్..  నువ్వొకటి నేనొకటి అనుకుంటూ సాగిస్తున్న ప్రయాణానికి పుల్ స్టాప్ పెట్టింది. తొలి నాలుగు మ్యాచ్ లలో ప్రతీ మ్యాచ్ కు విజేత మారగా ఐదో మ్యాచ్ లో మాత్రం పాకిస్తాన్ వరుసగా ఈ సిరీస్ లో రెండో విజయాన్ని అందుకోవడం గమనార్హం.  లాహోర్ వేదికగా జరగిన ఐదో టీ20లో  పాకిస్తాన్ నిర్దేశించిన 146 పరుగులను కూడా ఇంగ్లాండ్ ఛేదించలేకపోయింది. భారీ హిట్టర్లు ఉన్న ఆ జట్టు..  20 ఓవర్లలో 139 పరుగుల వద్దే ఆగిపోయింది. 

లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్..  19 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ (46 బంతుల్లో 63, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తప్ప మిగిలిన వారంతా దారుణంగా విఫలమయ్యారు. 

కెప్టెన్ బాబర్ ఆజమ్ (9) తన పేలవ ఫామ్ ను కొనసాగించగా షాన్ మసూద్ (7), హైదర్ అలీ (4), ఇఫ్తికార్ అహ్మద్ (15), అసిఫ్ అలీ (5), నవాజ్ (0), షాదాబ్ ఖాన్ (7), అమీర్ జమల్ (10) లు అలా వచ్చి ఇలా వెళ్లారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు తీయగా.. డేవిడ్ విల్లీ, సామ్ కరన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. 

అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ బ్యాటర్లు కూడా పాక్ బాటలోనే నడిచారు. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (3), అలెక్స్ హేల్స్ (1) విఫలమయ్యమారు.  కాస్త ప్రతిఘటించిన డేవిడ్ మలన్ (36) ను ఇఫ్తికార్ ఎల్బీగా వెనక్కి పంపాడు. ప్రమాదరక హిట్టర్లుగా పేరున్న  బెన్ డకెట్ (10), హ్యరీ బ్రూక్ (4) కూడా రాణించలేదు.  కెప్టెన్ మోయిన్ అలీ (37 బంతుల్లో 51 నాటౌట్, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చివరిదాకా పోరాడాడు.  

చివరి ఓవర్లో  15 పరుగుల అవసరమవగా తొలి టీ20 ఆడుతున్న అమీర్ జమేల్ కు  బాబర్ బంతినిచ్చాడు. అనుభవం లేకున్నా అమీర్ మాత్రం  అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి రెండు బంతుల్లో పరుగులేమీ రాలేదు. మూడో బంతి వైడ్.  తర్వాత  అదే బంతిని మోయిన్ అలీ సిక్సర్ గా మలిచాడు. ఇంగ్లాండ్ 3 బంతుల్లో 8 పరుగులు చేయాలి. కానీ చివరి మూడు బంతుల్లో రెండు పరుగులే వచ్చాయి. దీంతో పాకిస్తాన్ నే విజయం వరించింది.  ఐదు మ్యాచ్ లు ముగిసిన ఈ సిరీస్ లో పాకిస్తాన్ 3-2 ఆధిక్యంలో ఉంది. ఈనెల 30న ఇదే స్టేడియంలో ఆరో టీ20 జరుగుతుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios