బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో ఓ మ్యాచ్‌కి ముందు స్టేడియంలో సిగరెట్ తాగుతూ దొరికిపోయిన మహ్మద్ షాజాద్... మందలించి, వదిలేసిన బంగ్లా క్రికెట్ బోర్డు...

క్రికెట్ గ్రౌండ్‌లో సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయాడు ఆఫ్ఘాన్ క్రికెటర్ మహ్మద్ షాజాద్. ప్రస్తుతం బంగ్లా ప్రీమియర్ లీగ్ (బీపీఎల్‌ 2022) పాల్గొంటున్న మహ్మద్ షాజాద్, శుక్రవారం కొమిల్లా విక్టోరియన్స్‌తో షేరే బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ఆరంభానికి ముందు గ్రౌండ్‌లో స్మోకింగ్ చేస్తూ కనిపించాడు...

బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో శుక్రవారం జరగాల్సిన రెండు మ్యాచులు కూడా వర్షం కారణంగా రద్దయ్యాయి. వర్షం పడుతూ మ్యాచ్ ప్రారంభం ఆలస్యం కావడం, చినుకులు పడుతూ వాతావరణం చల్లగా మారడంతో ఇక ఉండబట్టలేకపోయిన మహ్మద్ షాజాద్, క్రికెట్ గ్రౌండ్‌లో ఉన్న విషయం కూడా మరిచిపోయి సిగరెట్ తీసి, వెలిగించి... దర్జాగా పొగలు ఊదుతూ కెమెరాల్లో దొరికిపోయాడు...

దీంతో బంగ్లా క్రికెట్ బోర్డు కోడ్ ఆఫ్ కండక్ట్ 2.20 నియమావళిని అతిక్రమించినందుకు మహ్మద్ షాజాద్‌ను మందలించి, వదిలేశారు మ్యాచ్ రిఫరీ. అతనికి ఓ డిమెరిట్ పాయింట్‌ను కలిపిన మ్యాచ్ రిఫరీ, మరోసారి ఇది రిపీట్ అయితే మహ్మద్ షాజాద్‌పై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందంటూ హెచ్చరికలు జారీ చేశారు..

ఐపీఎల్‌లో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో స్టేడియం బాల్కనీలో సిగరెట్ తాగుతూ కనిపించాడు కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్. జనాల అందరూ చూస్తుండగా స్టేడియంలో సిగరెట్ తాగినందుకు షారుక్ ఖాన్, కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా అతనిపై కొంత కాలం స్టేడియంలోకి రాకుండా నిషేధం కూడా విధించింది కోర్టు.

మీడియా ఫోటోలకు చిక్కకపోయినప్పటికీ ఢాకా జట్టు కోచ్ మిజనుర్ రెహ్మాన్, మహ్మద్ షాజాద్‌ను గ్రౌండ్‌లో సిగరెట్ తాగకూడదని హెచ్చరించాడని సమాచారం. అతని మిజనుర్ మాటలను షాజాద్ పట్టించుకోలేదు. దీంతో బంగ్లా క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ కూడా మహ్మద్ షాజాద్ దగ్గరికి వెళ్లి, డ్రెస్సింగ్ రూమ్ లోపలికి వెళ్లి, సిగరెట్ తాగమని పలుమార్లు సూచించాడట. అయితే అతని మాటలను కూడా మహ్మద్ షాజాద్ ఖాతరు చేయలేదని తెలియవచ్చింది...

బంగ్లా ప్రీమియర్ లీగ్ (బీపీఎల్‌ 2022) సీజన్‌లో మినిస్టర్ గ్రూప్ ఢాకా జట్టు తరుపున ఆడుతున్నాడు మహ్మద్ షాజాద్. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచుల్లో సింగిల్‌ డిజిట్‌కే పెవిలియన్ చేరిన మహ్మద్ షాజాద్, ఓ మ్యాచ్‌లో 53, మరో మ్యాచ్‌లో 42 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...

బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో ప్రతీ మ్యాచ్‌లోనూ ‘పుష్ఫ’ మానియా కనిపించింది. క్యాచ్ పట్టినా, వికెట్ తీసినా ఆఖరికి హాఫ్ సెంచరీ చేసి అవుటైనా కూడా అల్లు అర్జున్ ఫేమస్ డైలాగ్ ‘తగ్గేదేలా’ మేనరిజాన్ని ఇమిటేట్ చూస్తూ, ప్రేక్షకులను అలరించారు క్రికెటర్లు. మరికొందరు క్రికెటర్లు అయితే అల్లు అర్జున్ స్టెప్పులను కూడా ఇమిటేట్ చేసేందుకు ప్రయత్నించారు....

తాజాగా స్టేడియంలో సిగరెట్ తాగుతూ దొరికిపోయిన మహ్మద్ షాజాద్ కూడా ఓ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ తర్వాత అవుటై, పెవిలియన్‌కి వస్తూ ‘పుష్ఫ’ మేనేరిజాన్ని కాపీ కొడుతూ, ‘తగ్గేదేలా’ అంటూ డైలాగ్ కొట్టాడు... దీంతో బంగ్లా ప్రీమియర్ లీగ్ కాస్తా... ‘బంగ్లా పుష్ఫ లీగ్’గా మారిపోయిందంటూ ఛలోక్తులు కూడా విసురుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్...