Asianet News TeluguAsianet News Telugu

ICC Rankings: ప్రపంచ టీ20 క్రికెట్‌లో కొత్త మొనగాడు.. బాబర్‌ను వెనక్కినెట్టిన పాకిస్తాన్ వికెట్ కీపర్

ICC T20I Rankings: ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్  వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. తన టీ20 కెరీర్ లో తొలిసారి అగ్రస్థానాన్ని అధిరోహించాడు. 

Mohammad Rizwan dethrones Babar Azam for top spot in ICC T20I Rankings
Author
First Published Sep 7, 2022, 3:32 PM IST

పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ కు ఇతర జట్ల నుంచే కాదు.. సొంత జట్టు నుంచే తీవ్ర పోటీ ఎదురువుతున్నది. ముఖ్యంగా టీ20 క్రికెట్ లో బాబర్ తో పాటు ఓపెనింగ్ బ్యాటర్ గా వచ్చే  వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ సారథినే అధిగమించాడు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ లో అతడు.. నెంబర్ వన్  ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఆసియా కప్ లో గడిచిన మూడు మ్యాచుల్లో అదిరిపోయే ప్రదర్శనలతో రిజ్వాన్ ఈ ఘనత సాధించాడు. 

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ లో మహ్మద్ రిజ్వాన్ 815 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని అధిరోహించాడు. బాబర్ ఆజమ్ 794 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా  సౌతాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్.. 792 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.   టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్.. 775 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయాడు. 

ఆసియా కప్ కు ముందు టీ20లో  ప్రధాన పోటీ  బాబర్, సూర్య మధ్య ఉండేది. గత నెలలో సూర్య కొద్దిరోజుల పాటు ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని  ఆస్వాదించాడు.  అయితే ఆసియా కప్ లో సూర్యతో పాటు బాబర్ కూడా  మెరుగైన ప్రదర్శనలు చేయడం లేదు. కానీ  రిజ్వాన్ మాత్రం  మూడు మ్యాచుల్లో ఆకట్టుకున్నాడు. 

 

తొలుత భారత్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో  43 పరుగులు చేసిన రిజ్వాన్.. ఆ తర్వాత హాంకాంగ్ పై  78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  ఇక ఇటీవలే ముగిసిన సూపర్-4లో భారత్ తో ఆడుతూ.. 71 పరుగులు చేసి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.  ఐసీసీ  ర్యాంకుల నిబంధనల ప్రకారం.. ముందు బ్యాటింగ్ లో చేసే పరుగుల కంటే రెండో సారి  (ఛేదనలో) బ్యాటింగ్ చేసేప్పుడు ఎక్కువ రేటింగ్ పాయింట్లు లభిస్తాయి. ఆ విధంగా చూసుకుంటే రిజ్వాన్.. భారత్ తో తీవ్ర ఒత్తిడిలోనూ గాయం వేధిస్తున్నా పోరాడి జట్టును గెలిపించాడు. ఇది రిజ్వాన్ కు ప్లస్ అయింది.  ఈ టోర్నీలో 3 మ్యాచులాడిన రిజ్వాన్ ఇప్పటికే 192 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

 

మరోవైపు బాబర్ ఆసియా కప్ లో దారుణంగా విఫలమవుతున్నాడు. గడిచిన మూడు మ్యాచుల్లో 10, 9, 14 పరుగులే చేశాడు. సూర్య కూడా.. పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ లో 13 చేయగా హాంకాంగ్ తో మ్యాచ్ లో 68 పరుగులు చేశాడు. సూపర్-4లో పాక్ తో 34 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో అతడికి రేటింగ్ పాయింట్లు బాగా తగ్గాయి.  ఇక ఈ జాబితాలో తర్వాత స్థానంలో డేవిడ్ మలన్, ఆరోన్ ఫించ్, డెవాన్ కాన్వే, పతుమ్ నిస్సంక, మహ్మద్ వసీం, రీజా హెండ్రిక్స్  లు టాప్-10లో ఉన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios