బిగ్‌ బాష్ లీగ్‌లో పాల్గొన్న పాక్ బౌలర్ మహ్మద్ హస్నైన్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు... తాత్కాలిక నిషేధం విధిస్తూ, పాక్ సూపర్ లీగ్ నుంచి తప్పించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు...

పాకిస్తాన్ క్రికెట్‌ టీమ్‌కి ఊహించని షాక్ తగిలింది. యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ హస్నైన్ బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని తేల్చిన క్రికెట్ ఆస్ట్రేలియా, అతనిపై బౌలింగ్ వేయకుండా నిషేధం విధించింది. 21 ఏళ్ల మహ్మద్ హస్నైన్, పాకిస్తాన్ జట్టు తరుపున 8 వన్డేలు, 18 టీ20 మ్యాచులు ఆడాడు...

వన్డేల్లో 12 వికెట్లు తీసిన మహ్మద్ హస్నైన్, టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)తో పాటు కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), బిగ్‌ బాష్ లీగ్‌లో కూడా పాల్గొంటున్నాడు మహ్మద్ హస్నైన్...

బీబీఎల్ 2022 సీజన్‌లో సిడ్నీ సిక్సర్స్ తరుపున ఆడిన మహ్మద్ హస్నైన్ బౌలింగ్ యాక్షన్‌ను అనుమానాలు రావడంతో ఐసీసీ ఫిర్యాదు చేశారు అంపైర్ గెరార్డ్ అబూద్... దీంతో ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి బయలుదేరి వెళ్లే ముందు క్రికెట్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఐసీసీ, హస్నైన్ బౌలింగ్ యాక్షన్‌ను సమీక్షించింది...

ఈ సమీక్షకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అనుమతించింది. అయితే ఈ సమీక్షలో మహ్మద్ హస్నైన్ బౌలింగ్ యాక్షన్, ఐసీసీ నియమావళికి విరుద్ధంగా ఉందని నిర్ధారించారు. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరుపున ఆడుతున్న మహ్మద్ హస్నైన్‌ని ఆఖరి నిమిషంలో తుది జట్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది...

‘మహ్మద్ హస్నైన్ బౌలింగ్ యాక్షన్‌ని అన్ని విధాలుగా సమీక్షించడం జరిగింది. అతని బౌలింగ్ యాక్షన్, ఐసీసీ చట్ట విరుద్ధంగా ఉందని నిర్ధారణ అయింది. అతని బౌలింగ్ యాక్షన్‌లో కొన్ని అవసరమైన మార్పులు చేసుకోవాల్సిందిగా అతనికి ఇప్పటికే సూచించాం... లేకపోతే మహ్మద్ హస్నైన్ ఎప్పటికీ బౌలింగ్ చేయలేడు...’ అంటూ తెలిపాడు క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ పీటర్ రోచ్...

క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధాన్ని స్వీకరించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, మహ్మద్ హస్నైన్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. అతని బౌలింగ్‌ను పర్యవేక్షిస్తూ, అవసరమైన మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా ఓ బౌలింగ్ కన్సల్టెంట్‌ను త్వరలో నియమించబోతున్నట్టు ప్రకటించింది పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)...

ఫాస్ట్ బౌలర్లకు గుడ్ లెంగ్త్, ఫుల్ లెంగ్త్, స్లో బౌన్సర్, బౌన్సర్లు వేసేందుకు వీలుగా మోచేతిని 15 డిగ్రీల వరకూ వచ్చేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే 145 కి.మీ.ల వేగంతో బంతులు విసిరే మహ్మద్ హస్నైన్, తన మోచేతికి అనుమతించిన దాని కంటే ఎక్కువగా వంచుతున్నట్టుగా నిర్ధారించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి...

మహ్మద్ హస్నైన్‌ను పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి తప్పిస్తున్నట్టు కూడా ప్రకటన విడుదల చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. బౌలర్లు చట్ట విరుద్ధమైన బౌలింగ్ యాక్షన్‌తో నిషేధానికి గురికావడం ఇది మొదటిసారేం కాదు. ఇప్పటికే ముగ్గురు పాకిస్తాన్ బౌలర్లు, ఈ విధమైన ఇల్లీగల్ బౌలింగ్ యాక్షన్ కారణంగా నిషేధానికి గురయ్యారు...

పాకిస్తాన్ బౌలర్ల షబ్బీర్ అహ్మద్, మహ్మద్ హఫీజ్‌లతో పాటు సంచలన స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సయ్యద్ అజ్మల్‌ కూడా ఐసీసీ రూల్స్‌కి విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నారనే ఆరోపణలతో నిషేధానికి గురయ్యారు...