టీమిండియా యువ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్. ఐపీఎల్ 14వ సీజన్‌ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా నియమితుడైన రిషబ్‌ పంత్‌ భవిష్యత్తులో టీమిండియా కెప్టెనైనా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన జోస్యం చెప్పారు.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడటంతో అతని స్థానంలో పంత్‌ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌‌కు ఢిల్లీ జట్టుకు సారథ్యం వహించనున్నారు. గతేడాది కాలంగా మంచి ఫామ్‌లో వున్న ఢిల్లీ లాంటి యువ జట్టుకు పంత్‌ను కెప్టెన్‌గా నియమించడం మంచి నిర్ణయమని అజారుద్దీన్ వ్యాఖ్యానించారు.

ఆ బాధ్యతలను పంత్ సమర్ధవంతంగా నిర్వర్తిస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  పంత్‌.. గత కొద్ది నెలలుగా అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడని, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలలో అతని బ్యాటింగ్‌ ద్వారా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడని అజహర్‌ గుర్తుచేశాడు.

అతడి దూకుడైన ఆటతీరు భవిష్యత్‌లో భారత్‌ను మరింత పటిష్ట స్థితికి చేరుస్తుందని ఆయన ట్వీట్‌ చేశాడు. అయితే మరో యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్ ఐపీఎల్‌కు దూరమవ్వడం దురదృష్టకరమని అజహరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశాడు. 

కాగా, పంత్‌.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి భీకరమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో మూడో టెస్టులో 97, నాలుగో టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. తాజాగా ముగిసిన ఇంగ్లండ్‌ సిరీస్‌లోనూ అదే జోరును కనబరిచాడు.

చివరి రెండు వన్డేల్లో వరుస అర్ధశతకాలతో అలరించాడు. ఏప్రిల్ 9 నుంచి మొదలవుతున్న ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ముంబై వేదికగా చెన్నై సూపర్​కింగ్స్​తో తలపడనుంది.