ఇండియా-సౌతాఫ్రికాల మధ్య మొహాలీ వేదికన జరిగిన టీ20 లో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మ్యాచ్ జరుగుతుండగానే కొందరు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. వారిని అడ్డుకోవడంలో భద్రతా సిబ్బంది విఫలమయ్యారు. ఇలా  ఒక్కసారి కాదు రెండు సార్లు అభిమానులు భద్రతా వలయాన్ని దాటుకుని ఆటగాళ్లవైపు దూసుకువచ్చారు. ఈ ఘటనలు ఆటగాళ్ల భద్రతా వైపల్యాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి.

మొహాలీ టీ20లో టాస్ గెలిచిన టీమిండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సఫారీ టీం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. ఫీల్డింగ్ చేస్తున్న భారత ఆటగాళ్లవైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకుని బయటకు పంపించారు. 

ఆ తర్వాత భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మరో అభిమాని కూడా భద్రతా వలయాన్ని దాటుకుని వచ్చాడు. క్రీజులో వున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఆలింగనం చేసుకోడానికి ప్రయత్నించాడు. హటాత్తుగా అభిమాని తనవైపు దూసుకురావడంతో షాక్  కు గురవడం కోహ్లీ వంతయ్యింది. అయితే అప్పటికే అతడి వెంట పరుగెత్తుకుంటు వచ్చిన భద్రతా సిబ్బంది సదరు అభిమానిని బయటకు పంపించారు. ఇలా రెండు సార్లు జరగడంతో ఆటగాళ్ల భద్రతపై క్రికెట్‌ వర్గాల్లోనే ఆందోళన మొదలయ్యింది. 

ధర్మశాల వేదికన జరగాల్సిన మొదటి టీ20 వర్షం కారణంగా రద్దవగా రెండో టీ20 బుధవారం మొహాలీలో జరిగింది. ఇందులో సౌతాఫ్రికా నిర్దేశించిన 150 పరగుల లక్ష్యాన్ని కోహ్లీసేన కేవలం 19 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది.  ఛేదనలో కెప్టెన్ కోహ్లీ 72, ఓపెనర్ శిఖర్  ధవన్ 40 పరుగులతో రాణించారు. ముఖ్యంగా కోహ్లీ చివరి వరకు నాటౌట్ గా నిలిచి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు.