‘యాషెస్?’ అని ప్రశ్నార్థకంతో మొయిన్ ఆలీకి మెసేజ్ చేసిన బెన్ స్టోక్స్... ఆటపట్టిస్తున్నాడేమోనని LOL అంటూ మొయిన్ ఆలీ సమాధానం! చివరికి.. 

యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా జట్లు సిద్దమవుతున్నాయి. జూన్ 16 నుంచి ప్రారంభమయ్యే ఈ బూడిద సమరం కోసం ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ, టెస్టు రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని కమ్‌బ్యాక్ బ్యాక్ ఇచ్చాడు. తన నిర్ణయం వెనక అసలు కారణాన్ని తాజాగా బయటపెట్టాడు మొయిన్ ఆలీ...

‘బెన్ స్టోక్స్‌ నాకు ఓ క్వశ్చిన్ మార్కుతో ‘యాషెస్?’ అని మెసేజ్ పెట్టాడు. నాకు అప్పటికీ జాక్ లీచ్ గాయపడిన విషయం గురించి తెలీదు. నన్ను కావాలని ఆటపట్టిస్తున్నాడేమోనని ‘Lol’ అని రిప్లై ఇచ్చాను...

ఆ తర్వాత జాక్ లీచ్ గాయంతో బాధపడుతున్న విషయం తెలిసింది. అప్పుడు బెన్ స్టోక్స్‌తో ఛాట్ చేశాను. నేను రావాలని టీమ్ కోరుకుంటున్నట్టు తెలిపాడు. అంతే. యాషెస్‌ ఆడాలని ఫిక్స్ అయ్యాను. బెన్ స్టోక్స్ టీమ్‌లో ఆడడాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తాను...’ అంటూ కామెంట్ చేశాడు మొయిన్ ఆలీ...

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొయిన్ ఆలీ, బెన్ స్టోక్స్ ఇద్దరూ కూడా ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కి ఆడారు. బెన్ స్టోక్స్ రెండు మ్యాచులు మాత్రమే ఆడి 15 పరుగులు చేశాడు. రూ.15 కోట్లు పెట్టి బెన్ స్టోక్స్‌కి కొనుగోలు చేసింది సీఎస్‌కే.

అయితే గాయంతో చాలా మ్యాచులకు దూరంగా ఉన్న బెన్ స్టోక్స్, సీజన్‌లో ఒకే ఒక్క బౌలర్ చేసి వికెట్ కూడా తీయలేకపోయాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో 15 మ్యాచులు ఆడిన మొయన్ ఆలీ, బ్యాటుతో 124 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 9 వికెట్లు తీశాడు...

మొయిన్ ఆలీ జ్వరంతో బాధపడుతుండడంతో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చిన అజింకా రహానే, 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. దీంతో మిగిలిన మ్యాచుల్లో అతన్నే వన్ డౌన్, టూ డౌన్ బ్యాటర్‌గా ఉపయోగించింది సీఎస్‌కే...

అజింకా రహానే పర్ఫామెన్స్ కారణంగా మొయిన్ ఆలీ, అంబటి రాయుడు వంటి సీనియర్లకు ఈ సీజన్‌లో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు..

ఇంగ్లాండ్ తరుపున 64 టెస్టులు ఆడిన మొయిన్ ఆలీ, 5 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలతో 2914 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 195 వికెట్లు పడగొట్టాడు. 2019 వన్డే వరల్డ్ కప్, 2022 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు మొయిన్ ఆలీ....

బ్రెండన్ మెక్‌కల్లమ్, ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో ఆడిన 13 టెస్టుల్లో 11 విజయాలు అందుకుంది ఇంగ్లాండ్. బజ్ బాల్ కాన్సెప్ట్‌తో దూకుడే మంత్రంగా దూసుకుపోతున్న ఇంగ్లాండ్, యాషెస్ సిరీస్‌లో హాట్ ఫెవరెట్ టీమ్‌గా బరిలో దిగుతోంది. 

ది ఓవల్‌లో టీమిండియాని ఓడించి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిచిన ఆస్ట్రేలియా కూడా యాషెస్ సిరీస్‌‌కి ముందే ఇంగ్లాండ్ గడ్డ మీదే అద్భుత విజయాన్ని అందుకున్న ఉత్సాహంతో ఉంది. జూన్ 16న బర్మింగ్‌హమ్‌లో మొదలయ్యే యాషెస్ సిరీస్, జూలై 31న కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగే ఐదో టెస్టుతో ముగుస్తుంది..