ఇంగ్లండ్-శ్రీలంక క్రికెట్ మ్యాచ్‌లో అద్భుతం.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి
England vs Sri Lanka: ఇంగ్లండ్-శ్రీలంక మధ్య మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక ప్లేయర్లు ధనంజయ్ డి సిల్వా, ప్రభాత్ జయసూర్య కలిసి ఆసియా వెలుపల ఏ స్పిన్ జోడీ చేయని ఘనతను సాధించారు.
England vs Sri Lanka: ఇంగ్లండ్-శ్రీలంక మధ్య 3 టెస్టుల సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు పైచేయి కనిపిస్తోంది. శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. ప్రస్తుతం 23 పరుగుల ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్లు చరిత్ర సృష్టించారు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో ఆసియా వెలుపల ఎన్నడూ జరగనిది ఇప్పుడు జరిగింది.
ధనంజయ్ డి సిల్వా-ప్రభాత్ జయసూర్య కలిసి ఆసియా వెలుపల ఏ స్పిన్ జోడీ చేయని ఘనతను సాధించారు. సాధారణంగా ఇంగ్లండ్ పిచ్ లపై ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తుంటారు. అయితే శ్రీలంక కెప్టెన్ ధనంజయ్ డిసిల్వా ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్ స్పిన్నర్లతో బౌలింగ్ ప్రారంభించాడు. ఇది చూసి ఇంగ్లీష్ టీమ్ కూడా ఆశ్చర్యపోయింది.
ఈ మ్యాచ్ కు వర్షం విలన్ గా నిలిచింది. పలుమార్లు అడ్డుతగిలింది. మేఘాలు కమ్ముకోవడం, వెలుతురు ప్రభావంతో అంపైర్ లు వీలైనంత త్వరగా మ్యాచ్‌ను ముగించాలని అనుకున్నారు. శ్రీలంక కెప్టెన్ ధనంజయ్ ఏం పర్యాలేదంటూ మ్యాచ్ ను కొనసాగించడానికి ఒకే చెప్పాడు. చీకటి మేఘాల కారణంగా వెలుతురు తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫాస్ట్ బౌలర్లకు బదులు స్పిన్నర్లతో శ్రీలంక జట్టు బౌలింగ్ ప్రారంభించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో తొలి, రెండో ఓవర్లు స్పిన్ బౌలర్ల కొనసాగించింది. కెప్టెన్ ధనంజయ్ స్వయంగా తొలి ఓవర్ వేయగా, ఇది ఇంగ్లండ్ మైదానంలో షాకింగ్ నిర్ణయం అని చెప్పాలి. అక్కడితో ఆగలేదు. రెండో ఓవర్ కూడా స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యతో వేయించాడు. మాంచెస్టర్‌లో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే స్పిన్నర్లు వరుసగా రెండు ఓవర్లు బౌలింగ్ చేయడం షాకింగ్ సంఘటన. ఆసియా వెలుపలి దేశంలో ఇద్దరు స్పిన్నర్లు ఇన్నింగ్స్‌లో తొలి రెండు ఓవర్లు బౌలింగ్ చేయడం టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి.
ఏడో ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ను ఔట్ చేసి ప్రభాత్ జయసూర్య శ్రీలంకకు తొలి వికెట్ ను అందించాడు. దీని తర్వాత అసిత ఫెర్నాండో ఒల్లీ పోప్‌ను అవుట్ చేశాడు. 18 పరుగుల వద్ద బెన్ డకెట్, 6 పరుగుల వద్ద కెప్టెన్ ఒల్లీ పోప్ తో పాటు 30 పరుగుల వద్ద డాన్ లారెన్స్ కూడా ఔటయ్యారు. జో రూట్ 42 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. హ్యారీ బ్రూక్ 73 బంతుల్లో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రిస్ వోక్స్ 65 బంతుల్లో 25 పరుగులు చేసి అవుటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే వరకు జామీ స్మిత్ 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. స్మిత్‌తో పాటు, గస్ అట్కిన్సన్ నాలుగు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.