T20 Blast: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ 2023 లో మిడిల్‌సెక్స్ జట్టు సంచలనం సృష్టించింది. టీ20 చరిత్రలో రికార్డులను చెరిపేస్తూ సరికొత్త చరిత్ర లిఖించింది.
మినిమం ఫోర్, మ్యాగ్జిమమ్ సిక్స్... పొట్టి ఫార్మాట్ లో ఇది ప్రాథమిక సూత్రం. అయితే పవర్ ప్లే లోనో లేక చివరి ఓవర్లలోనో జట్లు ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తాయి. కానీ మ్యాచ్ మొత్తం ఇదే రిపీట్ అయితే..? ఇరు జట్లు ఒకరిని మించి ఒకరు బాదితే..? అప్పుడు రికార్డులు బద్దలు కావాల్సిందే. అవును.. రికార్డులు బద్దలయ్యాయి. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ - 2023 లో సర్రే, మిడిల్‌సెక్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. 253 పరుగుల లక్ష్యాన్ని మిడిల్‌సెక్స్ జట్టు మరో నాలుగు బంతులు మిగిలుండగానే బాదేసింది.
టీ20 బ్లాస్ట్ - 2023లో భాగంగా కెన్నింగ్టన్ ఓవల్ (లండన్) వేదికగా గురువారం సర్రే - మిడిల్ సెక్స మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే టీమ్.. 20 ఓవర్లలో ఏడువికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.
విల్ జాక్స్ విధ్వంసం
ఐపీఎల్ -16 లో ఆర్సీబీ కొనుగోలు చేసిన (గాయం కారణంగా ఆడలేదు) విల్ జాక్స్.. 45 బంతుల్లోనే 8 బౌండరీలు, 7 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేశాడు. అతడికి జతగా మరో ఓపెనర్ లారీ ఎవాన్స్ కూడా 37 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 85 రన్స్ చేశాడు. 12.4 ఓవర్లకే ఈ జోడీ 177 పరుగులు జోడించింది. అయితే ఈ ఇద్దరూ వెంటవెంటనే నిష్క్రమించడంతో సర్రే టీమ్.. 252 పరుగులకు పరిమితమైంది. ఇదే ఇన్నింగ్స్ లో విల్ జాక్స్ హాల్ మ్యాన్ వేసిన ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో విల్ జాక్స్ వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదాడు.
వాళ్లూ బాదారు..
భారీ లక్ష్య ఛేదనలో మిడిల్‌సెక్స్ కూడా తాము ఏం తక్కువ తిన్లేదన్నట్టుగా బాదింది. కెప్టెన్, ఓపెనర్ స్టీఫెన్ ఎస్కినాజి (39 బంతుల్లో 73, 13 ఫోర్లు, 1 సిక్స్), జో క్రాక్‌నెల్ (16 బంతుల్లో 36, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) 6.3 ఓవర్లలోనే తొలి వికెట్ కు 90 పరుగులు జోడించారు. ఆ తర్వాత మాక్స్ హౌల్డెన్ (35 బంతుల్లో 68, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) , ర్యాన్ హిగ్గిన్స్ (24 బంతుల్లో 48, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా వీరబాదుడు బాదారు. దీంతో మిడిల్ సెక్స్ 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. మిడిల్ సెక్స్ బాదుడు ధాటికి సామ్ కరన్ (4 ఓవ్లలో 55 రన్స్), సీన్ అబాట్ (1 ఓవర్ 20), గస్ అట్కిన్సన్ (3.2 ఓవర్లలో 53) , క్రిస్ జోర్డాన్ (4 ఓవర్లలో 41) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సర్రే టీమ్ కు క్రిస్ జోర్డానే సారథి.
టీ20లలో రెండో అత్యధిక ఛేదన..
ఈ విజయంతో మిడిల్ సెక్స్ టీమ్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టీ20 చరిత్రలో అత్యధిక ఛేదన చేసిన రెండో జట్టుగా నిలిచింది. ఈ జాబితాలో సౌతాఫ్రికా.. ఈ ఏడాది మార్చిలో వెస్టిండీస్ నిర్దేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. సౌతాఫ్రికా తర్వాత మిడిల్ సెక్స్ (254) రెండో స్థానంలో నిలిచింది. ఇక టీ20 బ్లాస్ట్, ఇంగ్లాండ్ టీ20 చరిత్రలో ఇదే హయ్యస్ట్ ఛేజింగ్..
