Asianet News TeluguAsianet News Telugu

ఆన్‌లైన్ హెడ్‌కోచ్‌ను నియమించుకోనున్న పాకిస్తాన్..! అదే జరిగితే ప్రపంచ క్రికెట్‌లోనే తొలిసారి..

Online Coach: క్రికెట్ లో  ఆన్‌లైన్ కోచింగ్ ఎలా వర్కవుట్ అవుతుందన్న డౌటానుమానం మీకు రావచ్చు.  హెడ్ కోచ్ టీమ్ తో ఉండి ప్లేయర్లకు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పినా అనవసర తప్పిదాలు చేస్తూ  ఓటములు మూటగట్టుకుంటున్నాయి  జట్లు. కానీ ఇప్పుడేమో....

Mickey Arthur Set To Become First Online Head coach For Pakistan Team, Reports MSV
Author
First Published Jan 30, 2023, 6:52 PM IST

కరోనా పుణ్యమా అని  ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు సంభవించాయి. ముఖ్యంగా విద్య, వ్యాపార రంగాల్లో అయితే అంతా ఆన్‌లైనే. కరోనా వల్ల  భారత్ తో  పాటు చాలా దేశాల్లో  పాఠశాల చదువుల స్థానే ఆన్‌లైన్ క్లాసులు వచ్చాయి.  కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు   ప్రభుత్వాలు ఈ విధానాన్ని అనుసరించాయి. తాజాగా  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా ఈ ఆన్‌లైన్ విధానానికి  జై కొడుతోంది. సంప్రదాయ క్రికెట్ కోచింగ్ (టీమ్ తో హెడ్ కోచ్, సిబ్బంది కలిసిఉండటం)  కు తెరదించి  ఆన్‌లైన్ కోచింగ్ కు మళ్లుతున్నది.  

అదేంటి క్రికెట్ లో  ఆన్‌లైన్ కోచింగ్ ఎలా వర్కవుట్ అవుతుందన్న డౌటానుమానం మీకు రావచ్చు.  హెడ్ కోచ్ టీమ్ తో ఉండి ప్లేయర్లకు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పినా అనవసర తప్పిదాలు చేస్తూ  ఓటములు మూటగట్టుకుంటున్న పాకిస్తాన్ క్రికెట్ టీమ్.. ఆన్‌లైన్ కోచింగ్  తో ఎలా నెట్టుకొస్తుందన్న అనుమానం  రాకమానదు. కానీ పీసీబీ మాత్రం  ‘వి కెన్ డూ..’అని  చెప్పుకొస్తోంది. 

పాకిస్తాన్ క్రికెట్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం పాక్ కు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న సక్లయిన్ ముస్తాక్ కాంట్రాక్ట్ త్వరలోనే ముగియనుంది. అయితే  గతంలో ఆ జట్టుకు హెడ్ కోచ్ గా పనిచేసిన ఆస్ట్రేలియాకు చెందిన మికీ ఆర్థర్ తిరిగి పాకిస్తాన్ టీమ్ కు హెడ్ కోచ్ గా రానున్నాడు. అయితే  భౌతికంగా అతడు టీమ్ తో కలవడు. అంతా ఆన్‌లైనే.  మ్యాచ్ కు ముందు, జరుగుతున్నప్పుడు.. ఆటగాళ్లు గానీ టీమ్ మేనేజ్మెంట్ గానీ  కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని మికీ ఆర్థర్ చెప్పిన సలహాలను  గ్రౌండ్ లో పాటించాలన్నమాట. 

ఇదే విషయమై  పీసీబీ చీఫ్ నజమ్ సేథీ ఇదివరకే  మికీతో చర్చలు కూడా జరిపారట. అయితే ఇప్పటికే కౌంటీ క్రికెట్ (ఇంగ్లాండ్) లోని డెర్బీషైర్ తో తనకు ఉన్న ఒప్పందం కారణంగా  పాకిస్తాన్ కు పూర్తిస్థాయి హెడ్ కోచ్ గా ఉండటం తనవల్ల కాదని,  ఆన్‌లైన్ లో  సేవలందిస్తానని  చెప్పాడట. దీనికి నజమ్ సేథీ అండ్ కో. కూడా  అంగీకారం తెలిపినట్టు పాకిస్తాన్ క్రికెట్ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. 

 

తాజా రిపోర్టుల ప్రకారం..  మికీ ఆర్థర్ పాక్ కు హెడ్ కోచ్ (ఆన్‌లైన్లో) గా నియమితుడవ్వం ఖాయమని అతడు  న్యూజిలాండ్ సిరీస్, ఆసియా కప్, ఆఫ్గనిస్తాన్ సిరీస్, వరల్డ్ కప్ 2024,  ఇంగ్లాండ్ టూర్ 2024  వరకు  ఆన్ లైన్ లో  పాక్ జట్టుకు సేవలందిస్తాడని తెలుస్తున్నది. అయితే ఈ ఏడాది భారత్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ కు మాత్రం తాను భౌతికంగా అందుబాటులో ఉన్నానని  పీసీబీకి మాటిచ్చినట్టు తెలుస్తున్నది.   ఒకవేళ ఈ  వార్తలు నిజమైతే గనక  ఒక అంతర్జాతీయ జట్టుకు ఆన్ లైన్ ద్వారా సేవలందించే తొలి హెడ్ కోచ్ గా మికీ ఆర్థర్ చరిత్రకెక్కుతాడు.  

 

ఇదిలాఉండగా మికీ ఆర్థర్ తో  పీసీబీ సంప్రదింపులు జరపడం, అతడిని ఆన్‌లైన్ కోచ్ గా నియమించుకోవడంపై  పాకిస్తాన్  క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిస్బా వుల్ హక్ వంటి  మాజీ ఆటగాళ్లుండగా ఆర్థర్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు.  ఆర్థర్ గతంలో పాక్ కు హెడ్ కోచ్ గా ఉండి వెలుగబెట్టింది ఏముందని, అతడికంటే మిస్బా ఆధ్వర్యంలో పాకిస్తాన్ మంచి విజయాలు సాధించిందని చెబుతున్నారు. మరి  పీసీబీ ఆర్థర్ ఆన్‌లైన్ కోచింగ్ కే ఓటేస్తుందో లేదో  మరేదైనా నిర్ణయం తీసుకోనుందా..? తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి ఉండాల్సిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios