గత కొద్దిరోజులుగా వర్ణ వివక్ష, జాతి వివక్ష కు సంబంధించిన ఘటనలు తీవ్ర దుమారం రేపుతూనే ఉన్నాయి. కాగా.. తాజాగా.. విండీస్ దిగ్గజ పేసర్ మైఖేల్ హోల్డింగ్ కూడా.. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. లైవ్ లోనే బోరుమని ఏడ్చేశాడు. తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలన్నింటిని గుర్తుతెచ్చుకొని మరీ ఏడవడం గమనార్హం.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఇంగ్లండ్‌, వెస్టిండీస్ మ‌ధ్య సౌతాంప్ట‌న్‌లో టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌కు కామెంట్రీ ఇస్తున్న స‌మ‌యంలో మైఖేల్ హోల్డింగ్ వ‌ర్ణ‌వివ‌క్ష‌పై భావోద్వేగంగా మాట్లాడారు. ఆ త‌ర్వాత ఆయ‌న స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ వ‌ర్ణ‌వివ‌క్ష గురించి వివ‌రంగా చ‌ర్చించారు. 

న‌ల్ల‌జాతీయులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్ని ఆయ‌న వివ‌రించారు.  త‌మ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్న స‌మ‌యంలో.. మైఖేల్ హోల్డింగ్ ఏడ్చేశారు.  భ‌ర్త న‌ల్ల‌గా ఉన్న కార‌ణంగా.. త‌న త‌ల్లితో ఇంట్లోవాళ్లు మాట్లాడేవారు కాదు అని హోల్డింగ్ గుర్తు చేసుకుని క‌న్నీళ్లు పెట్టాడు. కనీసం ఇప్పుడైన న‌ల్ల‌జాతీయుల్ని గుర్తిస్తార‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

‘నా తల్లిదండ్రులను గుర్తుచేసుకుంటే ఏడుపొస్తున్నది. వాళ్లు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో నాకు తెలుసు. మా నాన్న నల్లగా ఉన్నాడని మా అమ్మవాళ్ల కుటుంబం ఆమెతో మాట్లాడలేదు. అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వివక్ష నుంచి బయటపడేందుకు ఇంకా సమయం పడుతుంది. ఆ దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. సరైన దిశలో ఇది కొనసాగుతుందన్న నమ్మకం నాకుంది. అసలు వివక్షపై అవగాహన పెంచుకోవాలంటే చదువు అనేది తప్పనిసరి. మన మూలాలు ఏంటో గతంలోకి వెళ్లి తెలుసుకోవాలి. వందల ఏండ్ల క్రితం వంశ మూలాలు వచ్చాయి. అసలు నల్ల జాతీయులపై వివక్ష ఎప్పుడు మొదలైందో తెలుసుకోవాలి’ అని కన్నీళ్లను ఆపుకుంటూ హోల్డర్‌ విజ్ఞప్తి చేశాడు.