ఐపీఎల్ సీజన్లలో పురుషులకు ధీటుగా యాంకరింగ్ చేసి శెభాష్ అనిపించుకున్న మయాంతి లాంగర్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు దూరమవుతున్నారు. మాయాంతి ఆరు వారాల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.

తన భర్త, క్రికెటర్ స్టువర్ట్ బిన్నీతో కలిసి చేతిలో బిడ్డతో దిగిన ఫోటోను ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఇంట్లోనే  ఉంటూ రోజువారి ఐపీఎల్ మ్యాచ్‌లను స్టార్ స్టోర్స్‌లో చూస్తూ ఎంజాయ్ చేయబోతున్నానని చెప్పారు.

ఈ సందర్భంగా మా గ్యాంగ్ సభ్యులైన జతిన్ సపారు, సుహైల్ చాందోక్, క్రికెట్ ఆకాశ్, సంజన గణేషన్, స్కాట్ బైరిస్, బ్రెట్ లీ లాంటి వాళ్లను మిస్సవుతున్నానని మాయాంతి పేర్కొన్నారు.

గత కొన్నేళ్లుగా స్టార్ స్పోర్ట్స్ తనను కుటుంబంలో ఒకదానిలా చూసింది. వారు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో యాంకర్‌గా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించానని మాయాంతి గుర్తుచేసుకున్నారు.

కరోనా రాకపోయుంటే మార్చిలో ఐపీఎల్ జరిగి వుండేదని, గర్భవతిగా ఉన్నప్పటికీ యాంకరింగ్ చేద్దామని భావించానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో స్టార్ స్పోర్టస్ యాజమాన్యం తనకు చాలా మద్ధతునిచ్చిందని, ఇందుకు వారి కృతజ్ఞతలని మాయాంతి చెప్పారు.

బాబు తమ జీవితంలోకి ప్రవేశించాకా చాలా కొత్తగా అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. మయాంతి ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్ టోర్నీలతో పాటు ఇండియన్ కౌన్సిల్ లీగ్ (ఐసీఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లాంటి టోర్నీలకు యాంకర్‌గా వ్యవహరించారు.

మరోవైపు ఆమె భర్త స్టువర్ట్ బిన్నీ టీమిండియా తరపున 14 వన్డేలు, 6 టెస్టులు ఆడాడు. రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బిన్నీని ఆ జట్టు గతేడాది ఐపీఎల్ వేలం సందర్భంగా రిలీజ్ చేసింది.