రెండో ఓవర్‌లోనే మయాంక్ అగర్వాల్ వికెట్ కోల్పోయిన టీమిండియా... నో బాల్‌కి రనౌట్ అయిన ఓపెనర్, హై డ్రామా మధ్య మొదలైన పింక్ బాల్ టెస్టు... 

శ్రీలంక, టీమిండియా మధ్య రెండో టెస్టు హై డ్రామాతో మొదలైంది. 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి ఓవర్‌లో ఓ చక్కని షాట్‌తో ఫోర్ బాదిన మయాంక్ అగర్వాల్, రెండో ఓవర్‌లో దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు...

విశ్వ ఫెర్నాండో వేసిన రెండో ఓవర్‌లో మొదటి బంతికి ఫోర్ బాదిన రోహిత్ శర్మ, మూడో బంతికి సింగిల్ తీసుకున్నాడు. మయాంక్ అగర్వాల్ నాలుగో బంతిని ఎదుర్కోవడం, వికెట్ కీపర్, బౌలర్లు ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేయడం జరిగింది...

ఏం జరుగుతుందో గుర్తించేలోపే మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మ రన్‌కి రావాల్సిందిగా పిలవడం, మయాంక్ అగర్వాల్ చూసుకోకుండా ముందుకు వచ్చేయడం... బంతిని అందుకున్న వికెట్ కీపర్ వికెట్లను గీరాటేయడం జరిగిపోయాయి...

అయితే రనౌట్ చేసేందుకు ప్రవీణ్ జయవిక్రమ నుంచి బంతిని అందుకున్న వికెట్ కీపర్ డిక్‌వాల్, వికెట్లను గిరాటేసే ముందు డీఆర్‌ఎస్ కోరుతున్నట్టుగా సిగ్నల్ ఇవ్వడం వివాదాస్పదమైంది. డీఆర్‌ఎస్ కోరుకుంటే, ఆ బంతి డెడ్‌ బాల్‌గా పరిగణించాల్సి ఉంటుంది. డెడ్‌ బాల్‌తో రనౌట్ చేసినా అది చెల్లదు. అలాంటప్పుడు డీఆర్‌ఎస్ కోరుకున్న తర్వాత రనౌట్ ఎలా చేస్తాడు? 

అయితే డీఆర్‌ఎస్ కోరుకున్న తర్వాత అంపైర్, ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో ప్రత్యర్థి జట్టు షాక్‌కి గురి అయ్యింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఫీల్డింగ్ టీమ్ కెప్టెన్ డీఆర్ఎస్ తీసుకుంటున్నట్టు సిగ్నల్ ఇస్తేనే... అది లెక్కలోకి వస్తోంది.

వికెట్ కీపర్, బౌలర్ డీఆర్‌ఎస్ తీసుకుంటున్నట్టు సిగ్నల్ ఇచ్చినా, దాన్ని లెక్కలోకి తీసుకోరు. ఈ నిబంధన కారణంగా మయాంక్ అగర్వాల్ రనౌట్ కావాల్సి వచ్చింది. ఒకే బంతికి ఎల్బీడబ్ల్యూ అప్పీలు చేయడం, రనౌట్ కావడం, అది నో బాల్... డీఆర్‌ఎస్ తీసుకోవాలని అప్పీలు చేయడంతో హై డ్రామా మధ్య బెంగళూరు టెస్టు మొదలైంది...

మయాంక్ అగర్వాల్ సగం క్రీజు దాటి ముందుకు వెళ్లిపోవడం, అదే సమయంలో రోహిత్ శర్మ కూడా క్రీజు నుంచి బయటికి రావడంతో రోహిత్ శర్మ రనౌట్ గురించి లంక వికెట్ కీపర్ డీఆర్‌ఎస్ కోరి ఉంటాడని అనుమానిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్..

టెస్టు మ్యాచ్‌లో రనౌట్ రూపంలో తొలి వికెట్‌కి కోల్పోవడం గత పదేళ్లల్లో ఇదే తొలిసారి. ఇంతకుముందు 2012లో కోల్‌కత్తాలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రనౌట్ రూపంలో అవుట్ అయ్యాడు. 

2013లో చిన్నస్వామి స్టేడియంలో రోహిత్ శర్మ నాన్ స్ట్రైయిక్‌లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేశాడు. అలాగే నేటి మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌ను ఉత్తి పుణ్యానికి రనౌట్ చేసిన కెప్టెన్ రోహిత్ డబుల్ సెంచరీ బాదాలని కోరుకుంటున్నారు టీమిండియా అభిమానులు...

ఫెర్నాండో వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్ బాదిన రోహిత్ శర్మ, చిన్నస్వామి స్టేడియంలో 30 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ షార్జాలో 30 సిక్సర్లు బాదగా, ఆ రికార్డును చిన్న స్వామి స్టేడియంలో సమం చేసిన రోహిత్ శర్మ, మరో సిక్సర్ బాదితే టాప్‌లోకి దూసుకెళ్తాడు...