Asianet News TeluguAsianet News Telugu

మ్యాచ్ మధ్యలో సిగరెట్ లైటర్ కావాలంటూ కోరిన మార్నస్ లబుషేన్... లైటర్‌తో ఏం చేశాడో తెలిస్తే...

మ్యాచ్ మధ్యలో సిగరెట్ లైటర్ కావాలంటూ డ్రెస్సింగ్ రూమ్‌కి సిగ్నల్ ఇచ్చిన మార్నస్ లబుషేన్... లైటర్‌తో హెల్మెట్‌ని రిపేర్ చేసిన బ్యాటర్... 

Marnus Labuschagne asks Cigarette Lighter in the match against South Africa to repair helmet
Author
First Published Jan 4, 2023, 3:37 PM IST

క్రికెటర్లందూ ఆస్ట్రేలియా క్రికెటర్లు వేరయా... ప్రత్యర్థి ఆటగాళ్లను సెడ్జ్ చేయడంలో, బాల్ టాంపరింగ్ చేసి దొరికిపోవడంలో, అంపైర్లనే బెదిరించి నిర్ణయం ఛేంజ్ చేసుకునేలా చేయడంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రత్యేకమైన మార్కు సంపాదించారు. అయితే రికీ పాంటింగ్, ఆండ్రూ సైమండ్స్, షేన్ వార్న్ వంటి క్రికెటర్లు రిటైర్ అయిన తర్వాత ఆస్ట్రేలియాలో మునుపటి దూకుడు కనిపించడం లేదు... 

కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా, ఇప్పుడు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో టాప్‌లో నిలిచింది. 

ప్రస్తుతం సౌతాఫ్రికాతో తొలి రెండు టెస్టులు నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న ఆసీస్, సిడ్నీ వేదికగా మూడో టెస్టు ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి 47 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది...

వర్షం కారణంగా మ్యాచ్‌కి అంతరాయం కలగడంతో తొలి రోజు పూర్తి ఓవర్ల పాటు ఆట సాగలేదు. డేవిడ్ వార్నర్ 10 పరుగులు చేసి అవుట్ కాగా మార్నస్ లబుషేన్ 151 బంతుల్లో 13 ఫోర్లతో 79 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

లబుషేన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సిగరెట్ లైటర్ కావాలని డ్రెస్సింగ్ రూమ్‌కి సిగ్నల్ చేయడం చూసి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. క్రీజులో ఉన్న లబుషేన్ అడ్డగానే సిగరెట్ లైటర్‌ని తీసుకొచ్చారు సిబ్బంది. మ్యాచ్ ప్రత్యేక్షంగా చూస్తున్న ప్రేక్షకులతో పాటు టీవీల ద్వారా ఈ మ్యాచ్‌ని వీక్షిస్తున్న వారంతా లబుషేన్ సైగలను చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఆ లైటర్‌తో తన హెల్మెట్‌ లోపల కాలుస్తూ రిపేర్ చేశాడు మార్నస్ లబుషేన్...

హెల్మెట్ రిపేర్ చేయడానికి రకరకాల సాధనాలు అందుబాటులో ఉన్నప్పటికీ అన్నింటినీ కాదని, సిగరెట్ లైటర్ వాడిన మార్నస్ లబుషేన్ తెలివికి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. సిగరెట్లు తాగడం మానేస్తే మంచిదని మార్నస్ లబుషేన్‌కి  సలహాలు ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  

తొలి రెండు టెస్టు మ్యాచుల్లో నెగ్గిన ఆస్ట్రేలియా, సిడ్నీ టెస్టులోనూ గెలిస్తే సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తుంది. ఇదే జరిగితే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించగలుగుతుంది ఆస్ట్రేలియా. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న టీమిండియా, ఫిబ్రవరిలో ఆసీస్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ టెస్టు సిరీస్‌లో 2 టెస్టులు గెలిస్తే టీమిండియా నేరుగా ఫైనల్ చేరుతుంది...  గత సీజన్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఫైనల్ మ్యాచ్ ఓడిన భారత జట్టు, వరుసగా రెండు సార్లు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఆడిన జట్టుగా నిలుస్తుంది.. 

Follow Us:
Download App:
  • android
  • ios