Asianet News TeluguAsianet News Telugu

ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్‌గా బౌచర్.. సవాళ్లను అధిగమిస్తానంటున్న సఫారీ కోచ్

Mumbai Indians: ఐదేండ్ల పాటు ముంబై ఇండియన్స్ కు హెడ్ కోచ్ గా వ్యవహరించిన మహేళ జయవర్దెనే   ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ముంబై జట్టుకు కోచ్ అవసరం పడింది. దీంతో ఆ జట్టు దక్షిణాఫ్రికా  మాజీ వికెట్ కీపర్ ను నియమించింది.

Mark Boucher Appointed as Head Coach Of Mumbai Indians
Author
First Published Sep 16, 2022, 1:03 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్  (ఐపీఎల్) లో అత్యంత విజయవంతమైన జట్టుగా  ఉన్న ముంబై ఇండియన్స్.. వచ్చే సీజన్ నుంచి కొత్త హెడ్ కోచ్ తో బరిలోకి దిగబోతున్నది.  2017 నుంచి ఆ జట్టుకు హెడ్ కోచ్ గా పనిచేసిన శ్రీలంక మాజీ క్రికెటర్  మహేళ జయవర్దెనే ఇటీవలే ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో తాజాగా.. ముంబైకి హెడ్ కోచ్ గా మార్క్ బౌచర్ ను నియమించింది.  బౌచర్  ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిఉన్న టీ20 ప్రపంచకప్ తర్వాత  బౌచర్ సఫారీ టీమ్ కు వీడ్కోలు చెప్తాడు.  

బౌచర్ నియామకంపై గత  రెండ్రోజులుగా క్రికెట్ వర్గాలలో జోరుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రేసులో సైమన్ కటిచ్ తో పాటు ఇతర మాజీ క్రికెటర్ల పేర్లూ రేసులోకి వచ్చాయి. కానీ కటిచ్ ను దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్ లో ముంబైకి ఉన్న మరో ఫ్రాంచైజీ ఎంఐ కేప్‌టౌన్ కు నియమించింది ఆ జట్టు యాజమాన్యం.  

ఇక ముంబై ఇండియన్స్ జట్టుకు బౌచర్ పేరును ఖరారు చేస్తూ ట్విటర్ వేదికగా ప్రకటన చేసింది. బౌచర్ కు ‘వన్ ఫ్యామిలీ’కి  స్వాగతం చెబుతూ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా  ముంబై  ఇండియన్స్ ఓనర్ ఆకాశ్ అంబానీ స్పందిస్తూ..  ‘ముంబై జట్టుకు బౌచర్ కు ఘనస్వాగతం. అంతర్జాతీయ క్రికెట్ లో అతడికున్న అపార అనుభవం,  కోచ్ గా నిరూపించుకున్న అతడి నైపుణ్యం మాకు ఎంతగానో ఉపయోగపడతాయి. రానున్న కాలంలో బౌచర్ మా జట్టు విజయాలకు మార్గనిర్దేశం చేసి ఎంఐ ఘన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాడు..’ అని తెలిపాడు. 

 

ఇక తన ఎంపికపై  బౌచర్ స్పందిస్తూ.. ‘ఎంఐ హెడ్ కోచ్ గా నియమితుడవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఫ్రాంచైజీ క్రికెట్ లో వారిది ఘనమైన చరిత్ర. అత్యంత విజయవంతమైన ఆ ఫ్రాంచైజీలో ఆటగాళ్లతో కలిసి పనిచేయడానికి సవాళ్లను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ముంబై మంచి నాయకత్వం, ఆటగాళ్లతో కూడిన ఒక బలమైన యూనిట్. ఈ జట్టుతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను..’ అని  తెలిపాడు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాక  బౌచర్..  2019 నుంచి దక్షిణాఫ్రికా జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 

అయితే ఐపీఎల్ లో మరే జట్టుకూ సాధ్యంకాని రీతిలో ఏకంగా ఐదు ట్రోఫీలు నెగ్గిన  ముంబై  ఇండియన్స్  ఈ ఏడాది మే లో ముగిసిన ఐపీఎల్-15 సీజన్ లో బొక్క బోర్లా పడింది. కీలక ఆటగాళ్లందరినీ వేలంలో వదిలేసిన ముంబై.. అంతగా అనుభవం లేని ఆటగాళ్లతో ఆడి  పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. మరి ఈ జట్టును  బౌచర్  ఎలా నిలబెడతాడనేది ఇప్పుడు ఆసక్తికరం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios