కోల్ కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమతో చెప్పకుండా దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య జరగాల్సిన కోల్ కతా వన్డేను రద్దు చేయడంపై ఆమె గంగూలీపై అసహనం వ్యక్తం చేశారు 

సౌరవ్ తో అంత సవ్యంగానే ఉందని, అయితే తమతో ఒక్క మాట చెప్పాల్సిందని ఆమె అన్నారు. ఇక్కడ మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించినప్పుడు కోల్ కతా పోలీసులకైనా చెప్పలేదని ఆమె అన్నారు. ప్రభుత్వ అధికారుల్లో ప్రధాన కార్యదర్శి, పోలీసు కమిషనర్ లకో లేదా ఎవరికైనా ముందే ఎందుకు చెప్పలేదని ఆమె అడిగారు. 

నిర్ణయం తీసుకున్న తర్వాత చెప్తే ఎలా ఉంటుందని మమతా బెనర్జీ ప్రశ్నించారు. మ్యాచ్ ను ఆపాలని తాము చెప్పలేదని, ఇలాంటి పరిస్థితిల్లో మీరుంటే ఏం చేస్తారని ఆమె అన్నారు. 

దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగాల్సిన వన్డే సిరీస్ కరోనా వైరస్ కారణంగా రద్దయింది. ధర్మశాలలో ఈ నెల 12వ తేదీన జరగాల్సిన తొలి వన్డే వర్షం వల్ల రద్దు కాగా, మిగాత రెండు వన్డేలను కరోనా వైరస్ కారణంగా రద్దు చేశారు. 

కరోనా వైరస్ కారణంగా చాలా క్రీడా కార్యక్రమాలు రద్దయ్యాయి. ఇరానీ కప్ పోటీలు కూడా రద్దయ్యాయి. ఈ నెల 29వ తేదీ నుంచి జరగాల్సిన ఐపీఎల్ ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా పడింది.