ఆస్ట్రేలియాతో టీమిండియా ఇటీవల వన్డే సిరీస్ కోసం తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సిరీస్ లో కేవలం మూడో వన్డే మాత్రమే భారత్  గెలిచింది. కాగా.. ఈ మ్యాచ్ లో జడేజా ఇరగదీశాడు. దీంతో.. రవీంద్ర జడేజా పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. తన ఆటతీరుపై తాజాగా జడేజా స్పందించాడు.

తన ఆట క్రెడిట్ అంతా ధోనీకే దక్కుతుందని జడేజా పేర్కొన్నాడు.  ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న జడేజా.. తన బ్యాటింగ్‌ మెరుగుపడటానికి ప్రధాన కారణం ధోనినే అని పేర్కొన్నాడు. మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించిన తర్వాత పోస్ట్‌ మ్యాచ్‌ ఇంటర్వ్యూలో భాగంగా మీడియాతో జడేజా మాట్లాడాడు.

‘ ధోని భాయ్‌తో కలిసి అటు టీమిండియాకు చాలా కాలం ఆడాను. అలాగే సీఎస్‌కే తరఫున కూడా ఆడుతున్నా. ధోని ఎప్పుడూ భాగస్వామ్యాలు నమోదు చేయడంపైనే ఎక్కువ ఫోకస్‌ చేస్తాడు. ఒక్కసారి బ్యాట్స్‌మన్‌ క్రీజ్‌లో సెట్‌ అయిన తర్వాత భారీ షాట్లు ఆడటానికి వీలుంటుందని ధోనినే చెబుతూ ఉండేవాడు. చాలా కీలక సందర్భాల్లో ధోనితో కలిసే నేను ఎక్కువగా ఆడా. అతనితో కలిసి ఆడటాన్ని బాగా ఆస్వాదిస్తా. ధోని ఎప్పుడూ ఒక్కటే చెబతాడు. కడవరకూ క్రీజ్‌లో ఉండటానికి యత్నిస్తే పరుగులు అవే వస్తాయనే సూత్రాన్ని ధోని ఫాలో అవుతాడు. అదే విషయాన్ని నాకు చెప్పేవాడు. చివరి నాలుగు-ఐదు ఓవర్లో విలువైన పరుగులు సాధించాలంటే ముందు క్రీజ్‌లో ఉండటానికి యత్నించాలి అనే దాన్ని ధోని నమ్ముతాడు. ప్రధానంగా కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో భాగస్వామ్యం నమోదు చేయడం చాలా ముఖ్యం. అదే పరిస్థితి ఆసీస్‌తో చివరి వన్డేలో ఎదురైంది. హార్దిక్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని సాధించినందుకు సంతోషంగా ఉంది. ఆఖరి ఐదు ఓవర్లలో చాన్స్‌ తీసుకుందామని హార్దిక్‌-నేను అనుకున్నాం. అదే అమలు చేసి అప్పటివరకూ స్ట్రైక్‌ రొటేట్‌ చేశాం. అదే గేమ్‌ ప్లాన్‌లో భాగం’ అని తెలిపాడు.