Asianet News TeluguAsianet News Telugu

రంజీ ట్రోఫీ 2022 విజేతగా మధ్యప్రదేశ్... ఫైనల్‌లో ముంబైని చిత్తు చేసి సరికొత్త చరిత్ర...

41 సార్లు రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై జట్టుకి ఫైనల్ మ్యాచ్‌లో షాకిచ్చిన మధ్యప్రదేశ్... 6 వికెట్ల తేడాతో ఫైనల్‌లో ఘన విజయం అందుకుని, మొట్టమొదటి రంజీ ట్రోఫీ టైటిల్ కైవసం.. 

Madhya Pradesh won the Ranji Trophy title for the first time ever, by beating Mumbai
Author
India, First Published Jun 26, 2022, 4:08 PM IST

మధ్యప్రదేశ్ జట్టు, రంజీ ట్రోఫీ 2022లో సరికొత్త చరిత్ర సృష్టించింది. 41 సార్లు టైటిల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై, ఫైనల్ మ్యాచ్‌లో చిత్తు చేసి 20222 రంజీ ట్రోఫిని కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్‌కి ఇదే మొట్టమొదటి రంజీ ట్రోఫీ టైటిల్ కావడం  విశేషం...

23 ఏళ్ల క్రితం 1999లో చంద్రకాంత్ పండిట్ కెప్టెన్సీలో రంజీ ట్రోఫీ ఫైనల్‌లోకి వెళ్లిన మధ్యప్రదేశ్, టైటిల్ పోరులో పరాజయం పాలైంది. అయితే 23 ఏళ్ల తర్వాత ప్రస్తుతం ఆయన కోచింగ్‌లోనే మొట్టమొదటి రంజీ ట్రోఫీ టైటిల్‌ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది మధ్యప్రదేశ్...

తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ 134, యశస్వి జైస్వాల్ 78 పరుగులతో రాణించడంతో 374 పరుగులకి ఆలౌట్ అయ్యింది ముంబై.  యష్ దూబే 133, శుబ్‌మన్ శర్మ 116, రజత్ పటిదార్ 122 సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 536 పరుగుల భారీ స్కోరు చేసింది మధ్యప్రదేశ్ జట్టు.. 

రెండో ఇన్నింగ్స్‌లో ముంబై జట్టు 269 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సువేద్ పార్కర్ 51 పరుగులతో రాణించగా సర్పరాజ్ ఖాన్ 45, పృథ్వీషా 44 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 162 పరుగుల ఆధిక్యం పోగా మిగిలిన 108 పరుగుల లక్ష్యాన్ని 29.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించి... మొట్టమొదటి రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచింది మధ్యప్రదేశ్...

ఓపెనర్ యష్ దూబే 1, పార్థ్ సహాని 5 పరుగులు చేసి అవుటైనా హిమన్షు మంత్రి 55 బంతుల్లో 3 ఫోర్లతో 37 పరుగులు, శుబమ్ ఎస్ శర్మ 75 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 30 పరుగుల చేయగా రజత్ పటిదార్ 37 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు...

ఈ సీజన్‌లో 122.75 సగటుతో 982 పరుగులు చేసిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కి ‘మ్యాన్ ఆఫ్ సిరీస్’ దక్కగా శుబ్‌మన్ ఎస్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్’ దక్కింది.  

47వ సారి రంజీ ట్రోఫీ ఫైనల్‌కి చేరిన ముంబైకి ఇది ఆరో ఓటమి. ఇంతకుముందు 1947-48 సీజన్‌లో హోల్కర్‌, 1979-80 సీజన్‌లో ఢిల్లీ, 1982-83 సీజన్‌లో కర్ణాటక, 1990-91 సీజన్‌లో హర్యానా, 2016-17 సీజన్‌లో గుజరాత్ జట్లు రంజీ ట్రోఫీ ఫైనల్‌లో ముంబైని ఓడించాయి... 

ఈ సీజన్‌లో 982 పరుగులు చేసి 18 పరుగుల తేడాతో 1000 పరుగులు చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్. ముంబై తరుపున ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు సర్ఫరాజ్ ఖాన్. 2015-16 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ 1330  పరుగులు చేయగా అంతకుముందు 2008-09 సీజన్‌లో వసీం జాఫర్ 1260 పరుగులు, 2008-09 సీజన్‌లోనే అజింకా రహానే 1089 పరుగులు చేసి సర్ఫరాజ్ ఖాన్ కంటే ముందున్నారు. 

కోచ్‌గా చంద్రకాంత్ పండిట్‌కి ఇది ఆరో రంజీ టైటిల్. ఇంతకుముందు 2002-03, 2003-04, 2015-16 సీజన్‌లో ముంబైకి కోచ్‌గా రంజీ ట్రోఫీ గెలిచిన చంద్రకాంత్, 2017-18, 2018-19 సీజన్లలో విదర్భకు హెడ్ కోచ్‌గా రంజీ ట్రోఫీ టైటిల్స్ గెలిచాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios