లెజెండ్స్ లీగ్ క్రికెట్‌ 2023 టోర్నీలో ఇండియా మహారాజాస్‌కి వరుసగా రెండో ఓటమి... వరల్డ్ జెయింట్స్ చేతుల్లో 2 పరుగుల తేడాతో ఓడిన గంభీర్ టీమ్.. 

లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 టోర్నీలో ఇండియా మహారాజాస్‌కి రెండో ఓటమి ఎదురైంది. ఆసియా లయన్స్ చేతుల్లో 9 పరుగుల తేడాతో ఓడిన ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 2 పరుగుల తేడాతో పోరాడి ఓడింది...

తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 31 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేయగా క్రిస్ గేల్ 6 బంతుల్లో ఓ ఫోర్ బాది హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

షేన్ వాట్సన్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేయగా జాక్వస్ కలీస్ 12 బంతుల్లో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రాస్ టేలర్ 1 పరుగు, కెవిన్ ఓ బెయిన్ 4 పరుగులు చేసి హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. వార్ విక్‌ 1 పరుగు చేసి భజ్జీ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరగా బెస్ట్ 17 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేశాడు. 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన మోఫో రనౌట్ అయ్యాడు...

ఒకానొక దశలో 12.3 ఓవర్లలో 129/2 స్కోరుతో ఉన్న వరల్డ్ జెయింట్స్, వెంటవెంటనే వికెట్లు కోల్పోయి 166 పరుగులకే పరిమితమైంది. హర్భజన్ సింగ్ 4 వికెట్లు తీయగా ప్రవీణ్ తాంబే 2 వికెట్లు తీశాడు. ఇర్ఫాన్ పఠాన్‌కి ఓ వికెట్ దక్కింది. భారత మాజీ బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో 19 పరుగులు సమర్పించడం విశేషం..

ఈ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించేలా కనిపించింది ఇండియా మహారాజాస్.. రాబిన్ ఊతప్ప 21 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 29 పరుగులు చేయగా కెప్టెన్ గౌతమ్ గంభీర్ 42 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 68 పరుగులు చేశాడు. 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన మురళీ విజయ్ రిటైర్డ్ హార్ట్‌గా పెవిలియన్ చేరాడు...

సురేష్ రైనా 16 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేయగా యూసఫ్ పఠాన్ 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేశాడు. స్టువర్ట్ బిన్నీ 3 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒకానొక సమయలో భారత జట్టు విజయానికి 30 బంతుల్లో 32 పరుగులు మాత్రమే కావాల్సి వచ్చాయి. అయితే ఈ దశలో వరల్డ్ జెయింట్స్ బౌలర్లు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు...

16వ ఓవర్‌లో గంభీర్‌ని అవుట్ చేసిన రిచర్డ్ పావెల్, 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లో మౌంటీ పనేసర్ 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. విజయానికి 18 బంతుల్లో 24 పరుగులు కావాల్సిన దశలో టినో బెస్ట్ 3 పరుగులు మాత్రమే ఇచ్చి యూసఫ్ పఠాన్ వికెట్ తీశాడు. 19వ ఓవర్‌లో 13 పరుగులు రావడంతో ఇండియా మహారాజాస్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు కావాల్సి వచ్చాయి.

చివరి ఓవర్ వేసిన బ్రెట్ లీ, 5 పరుగులు మాత్రమే ఇచ్చి స్టువర్ట్ బిన్నీని అవుట్ చేశాడు. ఆఖరి బంతికి 4 పరుగులు కావాల్సి రాగా బ్రెట్ లీ అద్భుతమైన యార్కర్ సంధించాడు. దీంతో ఇర్ఫాన్ పఠాన్ 2 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు. ఇండియా మహారాజాస్ 2 పరుగుల తేడాతో ఓడింది..