Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ క్రికెటర్లకు షాక్, LLC సీజన్ 2లో ఆడనిచ్చేది లేదంటూ... లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లోనూ..

సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 8 వరకూ ఆరు నగరాల్లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్ 2...  డెహ్రాడూన్‌లో ఫైనల్ జరిగే ఛాన్స్... 

Legends League Cricket 2022 Venues Confirmed, Schedule going to release soon
Author
First Published Aug 24, 2022, 4:06 PM IST

లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ) సీజన్ 2ను అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మొదటి సీజన్‌లో ఆసియా లయన్స్ తరుపున ఆడిన పాక్ క్రికెటర్లకు ఈసారి ఊహించని షాక్ ఇచ్చింది మేనేజ్‌మెంట్. భారత్‌లో నిర్వహించే సీజన్ 2లో పాక్ మాజీ క్రికెటర్లకు అనుమతి లేదంటూ ఖరాఖండిగా తేల్చేశారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, సెప్టెంబర్ 16 నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్ 2 ప్రారంభించబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించింది మేనేజ్‌మెంట్...

ఓమన్ వేదికగా లెజెండ్స్ లీగ్ క్రికెట్ మొదటి సీజన్ జరిగింది. మూడు జట్లతో 7 మ్యాచుల్లో తొలి సీజన్‌ని ముగించిన మేనేజ్‌మెంట్, ఈసారి 15 మ్యాచులతో లీగ్‌ని విస్తరించాలని భావిస్తోంది. అదీకాకుండా ఒకే వేదికపై మ్యాచులన్నీ నిర్వహించకుండా భారత్‌లోని ముఖ్య నగరాల్లో మ్యాచులు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది ఎల్‌ఎల్‌సీ మేనేజ్‌మెంట్...

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఎల్‌ఎల్‌సీ సీజన్ 1లో ఆసియా లయన్స్‌ టీమ్‌కి పాక్ మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాగే పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్, ఉమర్ గుల్, మహ్మద్ యూసఫ్, మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ వంటి ప్లేయర్లు ఆడారు. ఈసారి పాక్ టీమ్ లేకుండా ఆసియా టీమ్ బరిలో దిగనుంది. 

కోల్‌కత్తాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మ్యాచులు జరుగుతాయి. ఆ తర్వాత లక్నోలో సెప్టెబర్ 21, 22, న్యూఢిల్లీలో 24,25,26 తేదీల్లో, కటక్‌లో 27,28,29,30 తేదీల్లో మ్యాచులను నిర్వహించబోతున్నారు...

ఆ తర్వాత అక్టోబర్ 1,2,3 తేదీల్లో జోద్‌పూర్‌లో జరిగిన మ్యాచులతో గ్రూప్ స్టేజీ మ్యాచులు ముగుస్తాయి. అక్టోబర్ 5-7 తేదీల్లో ప్లేఆఫ్స్ మ్యాచులు జరుగుతాయి. ఆ తర్వాత అక్టోబర్ 8న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఫ్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు ఇంకా వేదికలను ఖరారు చేయలేదు లెజెండ్స్ లీగ్ క్రికెట్ మేనేజ్‌మెంట్...

గ్రూప్ మ్యాచులకు వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి అహ్మదాబాద్‌లో కానీ ముంబైలో కానీ లేదా డెహ్రాడూన్‌లో కానీ ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచులు నిర్వహించాలని అనుకుంటున్నారట నిర్వాహకులు. 10 దేశాల ప్లేయర్లతో ఈసారి లెజెండ్స్ లీగ్ క్రికెట్‌ని నిర్వహించబోతున్నట్టు ప్రకటించాడు ఎల్‌ఎల్‌సీ ఫౌండర్, సీఈవో రమన్ రహేజా...

డేల్ స్టెయిన్, అశోక్ దిండా, గౌతమ్ గంభీర్, అల్బీ మోర్కెల్, జాంటీ రోడ్స్, ఇయాన్ మోర్గాన్, ఇర్ఫాన్ పఠాన్, జాక్వలిస్ కలీస్, ముత్తయ్య మురళీధరన్‌తో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఈసారి లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో పాల్గొనబోతున్నాడు...

సెప్టెంబర్ 18న ఇండియా ఎలెవన్ వర్సెస్ వరల్డ్ ఎలెవన్‌తో జరిగే మ్యాచ్‌లో మాత్రమే సౌరవ్ గంగూలీ ఆడతాడని సమాచారం. ఇప్పటికే ఈసారి లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడబోతున్నానని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సౌరవ్ గంగూలీ, ఈ మ్యాచ్ కోసం సాధన కూడా మొదలెట్టేశాడు. 

‘పాకిస్తాన్ నుంచి ఏ ప్లేయర్లు కూడా లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో పాల్గొనడం లేదు. వారికి బదులుగా మిగిలిన దేశాల క్రికెటర్లను డ్రాఫ్ట్‌గా ఎల్‌ఎల్‌సీలో కలపబోతున్నాం. లెజెండ్స్ అందరూ ఫుల్ సీజన్ అందుబాటులో ఉంటారు. ఏ మ్యాచ్ కూడా మిస్ కారు... అన్నీ సక్రమంగా కుదిరితే ఈసారి ఫైనల్ మ్యాచ్ డెహ్రాడూన్‌లో నిర్వహించాలని అనుకుంటున్నాం... ’ అంటూ తెలిపాడు లెజెండ్స్ లీగ్ క్రికెట్ వ్యవస్థాపకుడు, సీఈవో రమన్ రహేజా... 

వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా, యూసఫ్ పఠాన్, మునాఫ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ వంటి భారత మాజీ క్రికెటర్లు అందరూ లెజెండ్స్ లీగ్ క్రికెట్‌ సీజన్‌ 2లో ఇండియా ఎలెవన్ తరుపున ఆడబోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios