Asianet News TeluguAsianet News Telugu

బోణీ కొట్టిన ఇండియా మహారాజాస్... లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో సీనియర్ల సూపర్ షో...

హాఫ్ సెంచరీలతో మెరుపులు మెరిపించిన యూసఫ్ పఠాన్, తన్మయ్ శ్రీవాస్తవ... ఐదు వికెట్లు తీసిన పంకజ్ సింగ్...

Legends League Cricket 2022: India Maharajas beat World giants in first match of LLC
Author
First Published Sep 17, 2022, 11:25 AM IST

లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 టోర్నీకి ఘనంగా ప్రారంభించింది ఇండియా మహారాజాస్ జట్టు. వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది...

హామిల్టన్ మసకజా 15 బంతుల్లో 4 ఫోర్లతో 18 పరుగులు చేసి అవుట్ కాగా కెవిన్ ఓ బ్రియాన్ 31 బంతుల్లో 9 ఫోర్లతో 52 పరుగులు చేశాడు.. 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసిన కెప్టెన్ జాక్వస్ కలీస్‌ని హర్భజన్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. తిసారా పెరేరా 16 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 23 పరుగులు చేయగా తతేంద్ర తైబు 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

వికెట్ కీపర్ దినేశ్ రామ్‌దిన్ 29 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంకజ్ సింగ్ 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 5 వికెట్లు తీశాడు. హర్భజన్ సింగ్, జోగిందర్ శర్మ, మహ్మద్ కైఫ్ తలా ఓ వికెట్ తీశారు. ఇర్ఫాన్ పఠాన్ 2 ఓవర్లలో 15 పరుగులు ఇవ్వగా శ్రీశాంత్ 3 ఓవర్లలో 46 పరుగులు సమర్పించాడు...

171 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇండియా మహారాజాస్‌కి శుభారంభం దక్కలేదు. వీరేంద్ర సెహ్వాగ్ 4 పరుగులు చేసి అవుట్ కాగా పార్థివ్ పటేల్ 13 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మహ్మద్ కైఫ్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

తన్మయ్ శ్రీవాస్తవ 39 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేయగా యూసఫ్ పఠాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇర్ఫాన్ పఠాన్ 9 బంతుల్లో 3 సిక్సర్లతో 20 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు...

లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్ 2లో భాగంగా నేడు ఇండియా క్యాపటల్స్ జట్టు, గుజరాత్ జెయింట్స్‌తో తలబడుతుంది. ఇండియా క్యాపిటల్స్ టీమ్‌కి గౌతమ్ గంభీర్, గుజరాత్ జెయింట్స్ టీమ్‌కి వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నారు. ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్‌లో ఉన్న ప్లేయర్లే ఈ రెండు టీమ్స్‌లో కూడా ఆడతారు.

వరల్డ్ జెయింట్స్ కెప్టెన్ జాక్వస్ కలీస్, ఇండియా క్యాపిటల్స్ టీమ్‌లో ఆడితే.. క్రిస్ గేల్, డానియల్ విటోరీ వంటి ప్లేయర్లు గుజరాత్ జెయింట్స్‌ తరుపున ఆడబోతున్నారు.. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ 2022లో ఆడిన స్టువర్ట్ బిన్నీ, రాస్ టేలర్... నేటి మ్యాచ్‌లో లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో కనిపించబోతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios