లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్‌ 2లో ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు... ఇండియా క్యాపిటల్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం అందుకున్న గుజరాత్ జెయింట్స్... 

లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 టోర్నీ ఫ్యాన్స్‌కి అసలు సిసలు టీ20 మజాని అందిస్తోంది. టీ20ల్లో సెంచరీ చూడడమే అరుదు అనుకుంటే ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఇద్దరు ప్లేయర్లు సెంచరీలతో చెలరేగారు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్సీలోని గుజరాత్ జెయింట్స్ జట్టు 3 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగుల భారీ స్కోరు చేసింది. హామిల్టన్ మసకడ్జా 7, సోలోమన్ మిరే 9 పరుగులు చేయగా కెప్టెన్ జాక్వస్ కలీస్ డకౌట్ అయ్యాడు. దినేశ్ రామ్‌దిన్ 26 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేయగా సుహైల్ శర్మ డకౌట్ అయ్యాడు...

విండీస్ మాజీ క్రికెటర్ అస్లే నర్స్ 43 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 103 పరుగులు చేసి మెరుపు సెంచరీ అందుకున్నాడు.తన అంతర్జాతీయ కెరీర్‌లో 13 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడిన అస్లే నర్స్, ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. రజత్ భాటియా డకౌట్ కాగా లియామ్ ఫ్లంకెట్ 14 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేశాడు. ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ 5 పరుగులు చేశాడు. 

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ 6 పరుగులు చేయగా పార్థివ్ పటేల్ 13 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. యశ్‌పాల్ సింగ్ 20 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేశాడు. 

తిశార పెరేరా 1, ఎల్టన్ చింగుబర 3, రయడ్ ఎమ్‌రిట్ డకౌట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కెవిన్ ఓ బ్రియాన్ 61 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు చేసి సెంచరీ అందుకున్నాడు...

175 పరుగుల వద్ద కెవిన్ ఓ బ్రియాన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 179 పరుగుల వద్ద వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది గుజరాత్ జెయింట్స్. అయితే అప్పటికే ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన ప్రవీణ్ తాంబే, మొదటి నాలుగు బంతుల్లో 3 వికెట్లు తీసినా ఐదో బంతికి వైడ్ వేయడంతో గుజరాత్ జెయింట్స్‌కి విజయం దక్కింది.. ప్రవీణ్ తాంబే 3, లియామ్ ప్లంకెట్ రెండు వికెట్లు తీయగా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన విండీస్ మాజీ ఆల్‌రౌండర్ అస్లే నర్స్, బౌలింగ్‌లో 2 ఓవర్లలో 21 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు.